logo

అనిశాకు చిక్కిన అవినీతి చేప

మండలంలోని పొన్నపల్లి వీఆర్వో నీలం స్వాతి ఆన్‌లైన్‌లో భూమి యజమాని పేరు నమోదుకు చేసేందుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారు(అనిశా)కు మంగళవారం పట్టుబడ్డారు.

Published : 31 May 2023 05:51 IST

ఆన్‌లైన్‌లో భూమి నమోదుకు లంచం డిమాండ్‌
రైతు నుంచి రూ.18వేలు తీసుకుంటుండగా పట్టివేత

లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో స్వాతి

పొన్నపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని పొన్నపల్లి వీఆర్వో నీలం స్వాతి ఆన్‌లైన్‌లో భూమి యజమాని పేరు నమోదుకు చేసేందుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారు(అనిశా)కు మంగళవారం పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీలు ప్రతాప్‌, సత్యానంద్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో గుళ్లపల్లికి చెందిన రైతు వాగు దినేష్‌కు పొన్నపల్లిలో ఎకరా యాభై సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఈనెల 24న వీఆర్వో స్వాతిని కలిసి విన్నవించారు. ఆమె తన అధికారిక లాగిన్‌ నుంచి ఆన్‌లైన్‌లో రైతు కుటుంబ సభ్యుల పేరిట స్వయంగా దరఖాస్తు చేశారు. తదుపరి నమోదు ప్రక్రియ పూర్తి చేయడానికి ఆమె రైతు నుంచి రూ.20వేలు లంచం డిమాండ్‌ చేశారు. తాను అంత మొత్తం ఇవ్వలేనని రైతు చెప్పడంతో రూ.2వేలు తగ్గించుకుని రూ.18వేలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో బాధిత రైతు అనిశాని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం పొన్నపల్లి గ్రామ సచివాలయంలో వీఆర్‌వోకు రూ.18వేలు నగదు అందించాడు. వెంటనే అనిశా అధికారులు దాడి చేసి వీఆర్వో స్వాతిని అదుపులోకి తీసుకుని ఆమె నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకుని చెరుకుపల్లి ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ మల్లికార్జునరావు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ దాడిలో దాదాపు 14 మంది అనిశా సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన వీఆర్వో స్వాతి 2012లో గుళ్లపల్లిలో వీఆర్‌ఏగా విధుల్లో చేరారు. రెండేళ్ల క్రితం ఈమె వీఆర్‌ఏ నుంచి వీఆర్వోగా పదోన్నతి పొందారు.

మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీలు ప్రతాప్‌, సత్యానంద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని