logo

అడిగినంత ఇవ్వాల్సిందే...!

అధికారం చేతిలో ఉందని.. తామేం చేసినా చెల్లుబాటు అవుతుందని.. ప్రశ్నించే పరిస్థితి లేని వ్యాపారాలను కేంద్రంగా చేసుకుని కొందరు అధికారులు వసూళ్లకు శ్రీకారం చుడుతున్నారు.

Published : 08 Jun 2023 04:39 IST

జిల్లా ఉన్నతాధికారి పేరుతో వసూళ్లు
తరచూ ఇదేం పద్ధతంటూ ఆవేదన

ఈనాడు-బాపట్ల, నరసరావుపేట: అధికారం చేతిలో ఉందని.. తామేం చేసినా చెల్లుబాటు అవుతుందని.. ప్రశ్నించే పరిస్థితి లేని వ్యాపారాలను కేంద్రంగా చేసుకుని కొందరు అధికారులు వసూళ్లకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లాల విభజన తర్వాత నిధుల లభ్యత తగ్గిపోవడంతో ఏ పని చేయాలన్నా పరిశ్రమలు, గనుల నిర్వాహకులు, వ్యాపారులపైనే భారం పడుతోంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్పొరేటు సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద కొన్ని పనులు చేపడుతున్నారు. అయితే కొందరు అధికారులు సీఎస్‌ఆర్‌ పేరుతో సరికొత్త పంథాకు తెరతీశారు. ఆయా రంగాలకు లక్ష్యాలు విధించి సొమ్ము రాబడుతున్నారు. బాపట్ల జిల్లాలో ఒక ఉన్నతాధికారి పేరు చెప్పి రూ.30 లక్షలు వసూలు లక్ష్యం విధించారు. జిల్లాలో గనుల నిర్వాహకుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.70 వేల నుంచి రూ.73వేల సొమ్మును సీఎస్‌ఆర్‌ కింద చెల్లించాలని హుకుం జారీచేశారు. కొందరు సొమ్ము ఇచ్చిన తర్వాత సీఎస్‌ఆర్‌ కింద తీసుకుంటున్నందున తాము ఇచ్చిన సొమ్ముకు బిల్లులు ఇవ్వాలని అడిగితే బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదంటూ కబురు పంపారు. గతంలో రహదారి పేరుతో పెద్ద గనుల నుంచి రూ.5 లక్షలు, చిన్న స్థాయి నిర్వాహకుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారని రోడ్డు వేయకుండానే సొమ్ము కైంకర్యం చేసిన విషయాన్ని గుర్తుచేసినా స్పందన శూన్యం. ఇప్పుడు మళ్లీ వచ్చి మీకు నిర్ణయించిన సొమ్ము మేరకు చెప్పినట్లు చేస్తారా.. లేదా? అని చెబుతుండటంతో నిర్వాహకులు అవాక్కవుతున్నారు. గనుల రంగం కుదేలవుతున్న తరుణంలో తరచూ ఇలా వసూళ్లు చేస్తే ఎలా నడపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాలతో అష్టకష్టాలు పడుతుంటే అండగా నిలవాల్సిన తరుణంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.


బాధ్యత కూడా వారిదే..

బాపట్ల జిల్లాలోని రెండు మండలాల్లో గనులు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క మండలం నుంచి రూ.15 లక్షల చొప్పున రూ.30 లక్షల సొమ్ము వసూలు చేయాలని ఉన్నతాధికారి నుంచి ఆదేశాలు వచ్చాయి. దీని ఆధారంగా యంత్రాంగం గనుల నిర్వాహకుల నుంచి రెండు రోజుల్లో సొమ్ము వసూలు చేసి ఇచ్చే బాధ్యతను సైతం గనుల నిర్వాహకుల ప్రతినిధులకే అప్పగించింది. గనులు ఎక్కువగా ఉన్న మండలంలో రూ.15 లక్షలు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్కరు రూ.70వేలు చెల్లించాలని సూచించారు. తక్కువగా ఉన్న మండలంలో రూ.73వేలు చొప్పున వసూలు చేసి సొమ్మును సమకూర్చారు. రెండు రోజుల్లోనే వసూళ్ల కార్యక్రమాన్ని పూర్తిచేసి ఉన్నతాధికారికి ముట్టజెప్పడానికి సిద్ధమయ్యారు. నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నందున తనిఖీలకు వస్తే ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో నిర్వాహకులు ఉన్నతాధికారి చెప్పినంత సొమ్ము సమకూర్చడమే లక్ష్యంగా పావులు కదిపారు. ఉన్నతాధికారి పేరుతో వచ్చిన ఆదేశాలు కావడంతో తలా కొంత భరించక తప్పదని వారంతా ఓ నిర్ణయానికి వచ్చారు. కొందరైతే ఈ వ్యాపారంలో ఉన్నందున అడిగినంత ఇచ్చి ముందుకెళ్లడం మినహా మరో గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక పేరుతో ఏటా కొంత సొమ్ము వెచ్చించాల్సి వస్తోందని, నిర్వహణ కష్టంగా మారిన సమయంలో అదనపు భారం మోయడం ఇబ్బందిగా ఉందని మరో నిర్వాహకుడు వాపోయారు. ఉన్నతాధికారి పేరుతో యంత్రాంగం వసూళ్లకు దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని