logo

మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..

ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.

Published : 29 Mar 2024 04:33 IST

ప్రతిపక్షాల ఆరోపణలు ఖండించనందుకు శిక్ష
మద్యం వ్యాపారుల నుంచి రూ.లక్షలు వసూలు
న్యూస్‌టుడే, పొన్నూరు

అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. వ్యాపారులనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వ్యాఖ్యలను ఖండించమని ఆదేశించారు. ఆ ఆరోపణలు నిజమే కావడంతో వైకాపా నేత ఆదేశాలు పాటించేందుకు వ్యాపారులు వెనుకడుగు వేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వైకాపా నేత ఇకపై వ్యాపారం సాఫీగా చేసుకోనివ్వాలంటే అడిగిన మొత్తం చెల్లించాల్సిందేనని హూంకరించారు. దీంతో లబోదిబోమని వ్యాపారులు ఆ నేతకు ముడుపులు చెల్లించుకోవాల్సి వచ్చిన వైనమిది.

నష్టాలు.. కష్టాలు

పొన్నూరులో నాలుగు బార్‌లు నిర్వహించేందకు ప్రభుత్వం వేలం పాటలు నిర్వహించింది. మద్యం వ్యాపారులు పోటీ పడి ఒక్కొక్క బారుకు సూమారు రూ.85లక్షలు నుంచి రూ.91లక్షల వరకు పాట పాడి దుకాణాలు దక్కించుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మందుబాబులు బార్‌ వైపు రావడం లేదు. మద్యం వ్యాపారం అనుకున్న మేర  జరగకపోవడంతో బార్‌ యజమానులకు నష్టాలు వచ్చాయి. దీంతో వారు అధికార పార్టీలోని కీలక నేత కలిశారు.

కాసులు ముట్టజెప్పాల్సిందే..

మద్యం వ్యాపారులను గుంటూరు పిలిపించి సిండికేటుగా ఏర్పడమని వైకాపా నేత హుకుం జారీ చేశాడు. మద్యం వ్యాపారులు సిండికేటుగా ఏర్పాడ్డారు. మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేసినందుకు వ్యాపారులు రూ.20లక్షలు వసూలు చేసి వైకాపా నేతకు అందజేశారు. పొన్నూరు పట్టణ, మండల పరిధిలో గొలుసు దుకాణాలు నిర్వహించినందుకు ప్రతి నెలా రూ.6లక్షలు పైగా ముడుపులను వ్యాపారులు వైకాపా నేతకు ముట్టజెప్పినట్లు సమాచారం.

ప్రశ్నకు జవాబు ఏదీ?

పొన్నూరులో కొంతకాలం కిందట మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ వైకాపా నేతలు చేసిన అవినీతి అక్రమాలపై  ప్రజాఛార్జ్‌ షీట్‌ను ప్రజల ముందు ఉంచారు. ఆ సమయంలో మద్యం వ్యాపారులు నుంచి లక్షల రూపాయల అక్రమ వసూలు గురించి వైకాపా నేతను సూటిగా ప్రశ్నించారు. అక్రమ వసూలుపై వైకాపా నేతలు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. వైకాపా నేత ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంపై విమర్శలు వచ్చాయి. వైకాపా నేత మద్యం వ్యాపారులను పిలిపించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ చేసిన వ్యాఖలను ఖండించమని వైకాపా నేత వ్యాపారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

నిజమే కదా..

మద్యం వ్యాపారులు పొన్నూరులో రహస్యంగా సమావేశమయ్యాయి. వైకాపా నేత ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల చేసిన వాఖ్యలపై ఖండన ఇద్దామని కొంత మంది వ్యాపారులు ప్రతిపాదించారు. అందులో మరికొంత మంది వ్యాపారులు ‘వైకాపా నేతకు ముడుపులు ఇస్తున్న మాట నిజమే కదా’ అని ప్రశ్నించారు. కొంత మంది వ్యాపారులు మనమెందుకు ఖండన ఇవ్వాలని వ్యతిరేకించి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సమావేశంలో జరిగిన సారాంశాన్ని వ్యాపారులు వైకాపా నేతకు వివరించారు.\

ముచ్చటగా రూ.30 లక్షలు..

పొన్నూరులో మద్యం వ్యాపారం ఎలా చేస్తారో చూస్తానని వైకాపా నేత బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు రూ.60లక్షలు ముడుపులు చెల్లించాలని వ్యాపారులను డిమాండ్‌ చేశారు. ముడుపులు వసూలు చేసే బాధ్యతను ఆ పార్టీలోని యువ నాయకుడికి అప్పగించారు. వైకాపా నేత ఆదేశాలతో యువ నాయకుడు మద్యం వ్యాపారులతో చర్చించారు. అంత మొత్తంలో ముడుపులు చెల్లించలేమని ప్రాధేయపడినా వైకాపా నేత కరుణ చూపలేదు. చివరకు మద్యం వ్యాపారులు నచ్చజెప్పడంతో వైకాపా నేత దిగి వచ్చారు. దీంతో రూ.30లక్షలు ముడుపులు వ్యాపారులు చెల్లించి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని