logo

ప్రాణం తీసిన ఈత సరదా

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Published : 18 Apr 2024 05:30 IST

కాలువల్లో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

మేడికొండూరు, న్యూస్‌టుడే: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. కొన్నేళ్ల కిందట కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు కార్తిక్‌(20) మేడికొండూరు మండలంలోని ఒక కళాశాల వసతిగృహంలో ఉంటూ బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం శ్రీరామ నవమి కావడంతో కళాశాలకు సెలవు ప్రకటించారు. పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్తున్నామని చెప్పి కార్తిక్‌, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి కళాశాల నుంచి బయటకు వచ్చారు. కాసేపటికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బండారుపల్లి మేజర్‌ కాలవ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో  కార్తిక్‌ ఈత కొట్టేందుకు  గట్టుపై నుంచి కాలువలోకి దూకాడు. తొలుత రెండుసార్లు దూకి పైకి వచ్చిన అతడు.. మూడోసారి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో స్నేహితులు మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జయ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. స్థానికులు, ఈతగాళ్ల సాయంతో కాలువలో సుమారు నాలుగు గంటల పాటు జల్లెడ పట్టారు. ఘటనా స్థలికి కిలో మీటరు దూరంలో కార్తిక్‌ మృతదేహాన్ని గుర్తించారు. అతడి తల భాగం వద్ద రక్తపు గాయం ఉంది. ఈతకు దూకిన క్రమంలో నేలకు తగిలి గాయమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


సంగం జాగర్లమూడి వద్ద..

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ఈతకు కాలువలో దిగిన విద్యార్థి మృతి చెందిన ఘటన ఇది. తెనాలి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం... చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద ఉన్న కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్ధులు బుధవారం సాయంత్రం తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని సంగమేశ్వరాలయానికి వచ్చారు. వారిలో విద్యార్థి గల్లా వంశీకృష్ణ (18) కాలువలో ఈతకు దిగి ఒరవడికి కొట్టుకు పోయాడు. గమనించిన తోటి విద్యార్థి రక్షించే ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు కాలువలో దిగి వెతికారు. తుదకు రాత్రి వంశీకృష్ణ మృతదేహం లభించింది. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామానికి చెందిన వాడని పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని