logo

కీలక ఘట్టానికి వేళాయె

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Published : 18 Apr 2024 05:40 IST

నేటి నుంచి  25వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ

ఈనాడు-అమరావతి, కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేస్తారు. ఈ నెల 21 ఆదివారం కావడంతో ఆ రోజు స్వీకరించరు. గుంటూరు పార్లమెంటు స్థానానికి జిల్లా కలెక్టరేట్‌లో, అసెంబ్లీలకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ మధ్య నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరిస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి ఆర్‌వో ఛాంబర్‌లోకి అనుమతి ఉంటుంది. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ.25వేలు, అసెంబ్లీకి రూ.10వేల సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో సగం కడితే సరిపోతుంది. నామినేషన్ల దాఖలు గడువు పూర్తయిన తర్వాత ఈ నెల 26న వాటిని పరిశీలిస్తారు. 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 29న సాయంత్రం 3గంటల తర్వాత అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.

వంద మీటర్లలోకి అయిదుగురికే అనుమతి.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి బలం చూపేలా మందీ మార్బలంతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు తరలివస్తారు. అయితే వారందరినీ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల అవతలే నిలిపివేస్తారు. అక్కడి నుంచి రిటర్నింగ్‌ అధికారి వద్దకు కేవలం అభ్యర్థితో పాటు అయిదుగురు సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. నామపత్రాల స్వీకరణకు సంబంధించి గతంలో ఉన్న ఫారం 26ను ప్రస్తుతం ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో నూతన విధానంలోనే అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేయాల్సి ఉంది.

జిల్లాలో 17.87లక్షల ఓటర్లు.. జిల్లాలో ప్రస్తుతం 17.87 లక్షల మంది ఓటర్లున్నారు. వీరికి 1915 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలను నియమిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ, వెబ్‌ కాస్టింగ్‌, సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణ ఉంటుంది. ఎన్నికల విధుల్లో 13,800 మంది సిబ్బంది పాల్గొంటారు. 

కీలకమైన తేదీలివే...

నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 18
నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్‌ 25
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 26
ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 29
పోలింగ్‌ తేదీ మే 13
ఓట్ల లెక్కింపు, ఫలితాలు జూన్‌ 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని