logo

ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు

సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది.

Updated : 30 Apr 2024 07:12 IST

ఇంటికే పింఛను ఇవ్వాలని వృద్ధుల వేడుకోలు
ఆధార్‌తో అనుసంధానం.. ఏటీఎం కార్డులు లేవు
బ్యాంకులకు వెళ్లాలంటే ఛార్జీల భారం
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, నెహ్రూనగర్‌, మంగళగిరి, పెదకాకాని

సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. లబ్ధిదారులు వ్యయ, ప్రయాసలకోర్చి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించింది. అధికార వైకాపా ప్రభుత్వం పింఛన్ల పంపిణీని రాజకీయ కోణంలో చూడడం వల్లే ప్రస్తుతం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడుగు తీసి అడుగువేయలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్లో ఎంత మంది బ్యాంకులకు వెళ్లి పింఛను డబ్బులు తీసుకోగలరో అధికారులు ఆలోచించాలి.


దుష్ప్రచారానికి వైకాపా యత్నాలు...

సార్వత్రిక ఎన్నికల ముంగిట వేసే పింఛను కావడంతో ఏదో విధంగా లబ్ధిదారులకు అసౌకర్యం కలిగించి ఇదంతా విపక్షాల వల్లేనని దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని అధికార వైకాపా చూస్తోంది. వాలంటీర్లతో ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే విధానాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, అందువల్లే మీకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పడానికి తాజాగా ఈ నిర్ణయం తీసుకుందనేది స్పష్టమవుతోంది. వాలంటీర్లను ఇంటింటికీ పంపకూడదని చెప్పిందే తప్ప సచివాలయ ఉద్యోగులను కాదు. మే 1న లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛను సొమ్ములు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది ఉన్నా వినియోగించుకోకుండా సిబ్బంది లేరని కుంటిసాకులు చెబుతోంది.


ఇలా సాధ్యమే కదా...

మే 13న పోలింగ్‌. అప్పటి దాకా సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే అంగన్‌వాడీలు, మెప్మా ఉద్యోగుల సహకారం తీసుకోవచ్చు. ఒకటి, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఇంటికే పంపి పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ఎంతసేపటికీ సిబ్బంది లేరని బూచిగా చూపి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి అంతిమంగా విపక్షాల్ని తిట్టించాలనేది పాలకుల తీరుగా మారింది.


ఇంటింటికీ వెళ్లి ఇచ్చే వెసులుబాటు ఉన్నా..

ఏప్రిల్‌ 1న పింఛన్‌ కోసం ఎదురుచూపులు

జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలు 568 ఉన్నాయి. ఇందులో 4,368 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు 2,59,989 ఉన్నాయి. ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 462 పింఛన్లు ఉన్నాయి. సచివాలయాల్లో సిబ్బంది ఒక్కొక్కరు 60 చొప్పున పంపిణీ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. సచివాలయ సిబ్బంది చరవాణిలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని డివైజ్‌ ద్వారా పింఛను పంపిణీ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వార్డు, గ్రామ సచివాలయం సిబ్బంది ప్రతి విభాగానికి ఒక్కొక్కరు చొప్పున అందుబాటులో ఉన్నారు. పింఛను లబ్ధిదారులకు ఒకటి, రెండు రోజుల్లోనే ఇంటి వద్దే నూరు శాతం నగదు పంపిణీ చేసే అవకాశం ఉంది.


ఖాతాల్లో వేస్తే కష్టాలు ఇవి..

  • ప్రస్తుతం బ్యాంకు అకౌంట్లు ఉన్న వారి ఖాతాకు నగదు జమ చేయాలని ఆదేశించింది. లేనివారికి ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది. అసలు ఎవరికి బ్యాంకు ఖాతా ఉంది? ఎవరికి లేదో సచివాలయానికి వెళితే తప్ప వివరాలు తెలుసుకోలేని పరిస్థితి.
  • ఆపై ఆధార్‌ లింకు అయిన బ్యాంకు ఖాతాకే జమ చేస్తామంటోంది. ఆ వృద్ధుల్లో ఎందరికి బ్యాంకుతో ఆధార్‌ అనుసంధానమై ఉంటుందో ఆలోచించాలి.
  • వృద్ధులకు పింఛను సొమ్ములే ఆధారం ఇన్నాళ్లూ వారు ఖాతాల్లో ఎలాంటి సొమ్ము జమ చేయలేదు. ఏటీఎం కార్డులు లేని వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటివారు నేరుగా బ్యాంకుకే వెళ్లాలి. అది లేనివారు విత్‌డ్రా ఫాం నింపి తీసుకోవాలి. దాన్ని రాయించుకోవడానికి ఇతరులపై ఆధారపడాలి. లైనులో నిల్చుని సంతకం చేసి డబ్బులు తెచ్చుకోవాలి. బ్యాంకు శాఖలు దూరంగా ఉన్నవారికి ఇబ్బందులు తప్పేలా లేవు.
  • కొందరి బ్యాంకు ఖాతాలు లావాదేవీలు లేని కారణంగా, కనీస నగదు నిల్వ లేక మనుగడలో లేవు. ఫలితంగా ఖాతా నిర్వహణ ఛార్జీల పేరుతో పింఛన్ల రుసుముల నుంచి కోత విధించే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ప్రాణాలు పోయిన ఉదంతాలు కదిలించలేదా?

ఏప్రిల్‌ ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయాలకు పిలిచి పంపిణీ చేస్తేనే అప్పట్లో చాలా మంది వృద్ధులు సచివాలయాలకు అతికష్టం మీద వచ్చి కుప్పకూలిపోయారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే  ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం అవేమి పరిగణనలోకి తీసుకోకుండా మే 1న పంపిణీ చేయాల్సిన పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలివ్వడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.


బ్యాంకులో డబ్బులు డ్రా చేయడం రాదు
చిన్నా, గుంటూరు

నేను చదువుకోలేదు. పింఛను డబ్బులు బ్యాంకుల్లో వేస్తామంటే వాటిని ఎలా తీసుకోవాలో తెలియదు. ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు తీవ్రంగా ఉన్నాయి. ఇంత ఎండలో బ్యాంకుల దాకా వెళ్లాలంటే ఇబ్బంది. ఆటో ఛార్జీలు అవుతాయి. అంతచేసి అక్కడికి వెళితే క్యూలైన్‌లో నిల్చోలేని పరిస్థితి. ఎప్పటిలాగా ఇంటి వద్దకు వచ్చి ఇవ్వాలి.


ఖాతా వాడడం లేదు
హనుమంతురావు, గుంటూరు

నా బ్యాంకు ఖాతాను గత అయిదేళ్లుగా వాడడం లేదు. ఆ తర్వాత నాకు వయోభారం పెరగడంతో బ్యాంకుకు వెళ్లలేకపోయాను. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే హడలిపోతున్నాం. అంత ఎండలో బ్యాంకుకు వెళ్లి నా ఖాతా వినియోగంలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నాలాంటి వృద్ధులకు పింఛన్లు ఇంటి వద్దకు వచ్చి ఇస్తే బాగుంటుంది.


ప్రాణాలతో చెలగాటమా!
- ఆత్మకూరి వెంకటేశ్వర్లు, పెదకాకాని

పింఛనుదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. బ్యాంకు సేవలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటలకు ముగుస్తాయి. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇంతటి ఎండలో బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోమని చెప్పడం దారుణంగా ఉంది. వడదెబ్బకి గురై ప్రాణాల మీదకు తెచ్చుకోమని సీఎస్‌ చెబుతున్నట్లు ఉంది. ఓట్ల కోసం రాజకీయం చేయడం దారుణం.


సచివాలయ ఉద్యోగులతో పంపిణీ సులభ
- వి.శ్రీనివాసరావు, మంగళగిరి

పింఛన్లు ఇంటి వద్దే ఇవ్వడం చాలా తేలికైన విషయం. ఒక్కో గ్రామంలో రెండు సచివాలయాలు ఉంటున్నాయి. వాటిలో కనీసం 16 మంది ఉద్యోగులు ఉంటున్నారు. ఆ గ్రామ పింఛనుదారులు అంచనా వేసుకుంటే ఒక్కో ఉద్యోగికి 40 నుంచి 60 లోపే పింఛన్లు వస్తాయి. వారు ఇళ్లకు వెళ్లి రెండు రోజుల్లో పంపిణీ పూర్తిచేయవచ్చు. గత నెలలో ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులు బయటకు రాకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టారు. వెల్ఫేర్‌ సెక్రటరీ సహకారంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని