logo

ఆరోగ్య సమాచారం.. సమస్తం నిక్షిప్తం

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సర్కారు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడంతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది. అసాంక్రమిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌

Published : 09 Dec 2021 05:24 IST

 ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్న ఆశా కార్యకర్తలు

చిన్నారికి టీకా వేస్తున్న ఆశా కార్యకర్త (పాతచిత్రం)

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సర్కారు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడంతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది. అసాంక్రమిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులకు ప్రతి నెలా ఉచిత చికిత్సతో పాటు మందులు పంపిణీ చేస్తున్నారు.

తాజాగా ప్రతి కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.  కుటుంబాల్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ‘ఆశా డిసీజ్‌ ప్రొఫైల్‌’ యాప్‌ను రూపొందించారు. దీనికి సంబంధించి ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. జిల్లాలోని రామగుండం నగరపాలకసంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు, 266 పంచాయతీల్లో ఆశా కార్యకర్తలు మొబైల్‌ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేతో ఏయే వ్యాధిగ్రస్థులు ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తేలనుంది. జిల్లాలో ఇంటింటా ఆరోగ్య సర్వే తుది దశకు చేరింది.

సర్వే ఎందుకంటే..

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వైద్య సేవలందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నాయి. వాటి ఆధారంగా చికిత్స, మందులు అందిస్తున్నారు. కాగా పుట్టిన పిల్లలు కూడా వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు అందిస్తున్నారు. అయితే కొన్ని రకాల వ్యాధులకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుండటంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. అలాగే పలు వ్యాధులకు సంబంధించి మందులు అరకొరగా కేటాయిస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏ వ్యాధితో ఎంత మంది బాధ పడుతున్నారో తెలుసుకునేందుకు ఈ సర్వే దోహదపడనుంది.

నెలాఖరులోగా పూర్తి..

జిల్లాలో 6 పట్టణ, 18 గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో 506 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా కుటుంబాల వివరాలు యాప్‌లో నమోదు చేసేందుకు ఆశా కార్యకర్తలకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డు కేటాయించారు.

* ప్రతి ఇంటికీ వెళ్లిన ఆశా కార్యకర్త కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నారో తెలుసుకుంటారు. వారి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకుంటారు. క్షయ, క్యాన్సర్‌, మధుమేహం, రక్తపోటు, దగ్గు, దమ్ము, హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులు, రక్తహీనత తదితర రుగ్మతలకు సంబంధించి బాధితుల వివరాలు నమోదు చేస్తున్నారు.

* కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మద్యపానం, పొగ, గుట్కా, జర్దా వంటి వ్యసనాలున్నాయా? అనే వివరాలు నిక్షిప్తం చేసుకుంటారు. కుటుంబ యజమాని స్థితిగతులు, ఆదాయం, కుళాయి కనెక్షన్‌, రేషన్‌కార్డు, పాన్‌కార్డు, ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారా? చదువు, ఉద్యోగాల వివరాలు పొందుపరుస్తున్నారు.

* జిల్లాలో ఇప్పటివరకు 4,76,506 మంది వివరాలను నమోదు చేశారు. మరో లక్ష మంది వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంది. వీటిని నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, గర్భిణులు, బాలింతలకు పరీక్షలు జరిపించడం, పిల్లలకు టీకాలు వేయించాల్సి ఉండటంతో ఈ సర్వేతో తమపై పని భారం పెరుగుతుందని ఆశా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

అందుబాటులో ఆరోగ్య స్థితిగతులు ప్రమోద్‌కుమార్‌, డీఎంహెచ్‌వో

జిల్లాలో ‘ఆశా డిసీజ్‌ ప్రొఫైల్‌’ యాప్‌లో వివరాల నమోదు జోరుగా సాగుతోంది. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుటుంబంలోని సభ్యులందరి ఆరోగ్య వివరాలు పొందుపరుస్తున్నారు. ఈ సర్వే పూర్తయితే ఆరోగ్య స్థితిగతులు సులువుగా తెలుసుకునే వీలుంటుంది. నెలాఖరులోపు సర్వే పూర్తి చేసేందుకు సిబ్బందిని సమన్వయం చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని