logo

కాసులే లక్ష్యం.. కేసులే సాక్ష్యం

గతంలో ఆర్టీఏ అధికారులకు జిల్లా మొత్తంగా కలిపి సుమారుగా రూ.10 లక్షలను జరిమానాల రూపంలో ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంగా ఉండేది. కాని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా అందిన ఆదేశాల మేరకు ఒక్కో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌కు రూ.6లక్షలను లక్ష్యంగా నిర్ణయించారు.

Published : 24 May 2022 04:30 IST

రోడ్లపై పెరిగిన పోలీసు, ఆర్టీఏల తనిఖీలు

ఈనాడు, కరీంనగర్‌

* ఇలా.. నగరంలో గడిచిన కొన్ని రోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు రెండు మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. సుమారు 10-15 మంది సిబ్బంది ఇరువైపులా వెళ్లే ద్విచక్రవాహనదారుల్ని ఆపుతూ ధ్రువపత్రాల్ని పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క పత్రం సరిగ్గా లేకున్నా ఈ-చలాన్లతో జరిమానా విధిస్తున్నారు. ఆయా కార్యాలయాలకు.. విధులకు వెళ్లే సమయంతోపాటు సాయంత్రం వేళల్లో ఈ తరహా పరిశీలనల్ని చేపడుతున్నారు. రద్దీగా ఉన్న మార్గాల్లో పహారా కాస్తూ కేసుల్ని నమోదు చేస్తున్నారు. ఓ వైపు కెమెరాలతో ఆయా కూడళ్ల వద్ద కాపుకాస్తూ శిరస్త్రాణం లేనివారిని ఫొటో తీస్తూనే మరోవైపు వాహనాల్ని ఆపుతూ తమదైన తరహాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


* గతంలో ఆర్టీఏ అధికారులకు జిల్లా మొత్తంగా కలిపి సుమారుగా రూ.10 లక్షలను జరిమానాల రూపంలో ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంగా ఉండేది. కాని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా అందిన ఆదేశాల మేరకు ఒక్కో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌కు రూ.6లక్షలను లక్ష్యంగా నిర్ణయించారు. అంటే రోజుకు కనీసం రూ.20 వేల జరిమానాలను వాహనదారులకు విధించాలి. ఇదంతా వారికి అంతర్గతమైన విషయం. పైకి మాత్రం వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామనేలా నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న బండ్లను గుర్తిస్తున్నామనేలా వాటిని ఆపుతూ ఆయా పత్రాల పరిశీలన సహా అధిక లోడు ఇతర వివరాల్ని అడిగి ఏ ఒక్కటి లేకున్నా కేసు కడుతున్నారు. వాస్తవానికి రవాణా శాఖ నిబంధనలను పక్కాగా అమలు చేసే బాధ్యత పోలీసులది.. రవాణా శాఖ అధికారులదే అయినా.. ఇటీవల మాత్రం వీరి తనిఖీల చర్యలు పలురకాలుగా అడుగడుగునా కనిపిస్తున్నాయి. వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో 82,929 కేసుల్ని వాహనదారులపై ట్రాఫిక్‌ ఉల్లంఘనలో భాగంగా నమోదు చేశారు. ఇందులో శిరస్త్రాణం ధరించనందుకు 66వేలకుపైగా ధ్రువపత్రాలు లేనివి దాదాపుగా 8వేల మందికి రుసుము చెల్లించాలనేలా సందేశాల్ని పంపించారు. గతేడాది చివరి నాటికి 5,14,612 మందికి శిరస్త్రాణం లేని కారణంగా రూ.9కోట్ల జరిమానా విధించారు. అక్రమంగా ఇసుక, మట్టిని తరలిస్తున్న వాహనాల్ని పట్టుకుంటున్నారు. 2019లో 32 కేసులు నమోదు చేసి 30 లారీలు, 5 టిప్పర్లు, 10 జేసీబీలు, 477 ట్రాక్టర్లు సహా మరో 10 వాహనాల్ని పట్టుకున్నారు. 2020లో 31 కేసుల్లో 12 లారీలు, 2 టిప్పర్లు, 4 జేసీబీలు 1001 ట్రాక్టర్లు ఇతర వాహనాలు మరో 25 స్వాధీన పర్చుకున్నారు. 2021లోనూ 41 కేసులకుగానూ 772 ట్రాక్టర్లు, 28 లారీలు సహా మరో 30 బండ్లను అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ ద్వారా 2021-22లో కేవలం తనిఖీల ద్వారా రూ.3.52కోట్ల ఆదాయం సమకూరగా. ఈ వార్షిక సంవత్సరంలోనూ దాదాపుగా రూ.4కోట్ల రాబడి రానుంది.


అవగాహన మంత్రమేది..?

అక్రమ రవాణాలను పట్టుకునే విషయంలో కేసుల తీరు సమంజసంగానే ఉన్నా.. ద్విచక్రవాహనదారులకు విధించే జరిమానాల విషయంలోనే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏ ఒక్క ధ్రువపత్రం లేకున్నా వెంటనే రుసుము చెల్లించాలనేలా సందేశాలు వస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం అవగాహన కల్పించడం లేదా.. సంబంధిత ధ్రువపత్రాలు తీసుకునేందుకు ఒక్క అవకాశమిచ్చి వదిలేసేలా ఏ ఒక్క చోట కూడా పోలీసులు కనికరించడంలేదనేది వాస్తవం. ముఖ్యంగా వాహన బీమా పత్రం లేని వారికి కూడా ఏకంగా రూ.వెయ్యి కట్టాలని ఈ-చలనాలో వివరాల్ని నమోదు చేస్తున్నారు. అసలు ఈ పత్రాన్ని పొందేందుకు ఏడాదికి కూడా దాదాపుగా అంతే రుసుముంటుంది. మరోవైపు పోలీసులు గతంలో మాదిరిగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న దాఖలాలు జిల్లాలో కనిపించడం లేదు. రోడ్డు భద్రత సమయంలోనూ నామమాత్రపు కార్యక్రమాలుంటున్నాయి. చోదకులను తనిఖీ చేసే బాధ్యత ఎంత ఉంటుందో అదే స్థాయిలో వారికి రవాణా నిబంధనలు, ఇతరత్రా విషయాల్ని తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మాకుండే లక్ష్యాలు మాకుంటాయని పోలీసులు బాహాటంగానే పెదవి విరుస్తుండటం కేసుల నమోదు విషయంలో ఉన్న ఇబ్బందిని చెప్పకనే చెబుతోంది. వీటి పరంగా ఒత్తిడి అధికమవుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి చెప్పడం కొసమెరుపు.!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని