logo

తల్లీ బిడ్డకు ఆరోగ్య భద్రత

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. తల్లీ బిడ్డల ఆరోగ్యం దృష్ట్యా సాధారణ కాన్పులను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించింది. పాలనాధికారిణి సర్వే సంగీత అయిదు రోజుల కిందట జిల్లాలోని స్త్రీవైద్య నిపుణులు, పురోహితులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమావేశమై ఈ మేరకు అవగాహన కల్పించారు. ముహూర్తాలు చూసుకుని శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వారికి దిశా నిర్దేశం...

Published : 25 May 2022 02:39 IST

ప్రసవ శస్త్రచికిత్సలు తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి
 ఆసుపత్రులు, ఆలయాల్లో గోడపత్రికల ప్రదర్శన
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

గోదావరిఖని ప్రాంతీయ ఆసుపత్రిలోని బాలింతల వార్డు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. తల్లీ బిడ్డల ఆరోగ్యం దృష్ట్యా సాధారణ కాన్పులను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించింది. పాలనాధికారిణి సర్వే సంగీత అయిదు రోజుల కిందట జిల్లాలోని స్త్రీవైద్య నిపుణులు, పురోహితులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమావేశమై ఈ మేరకు అవగాహన కల్పించారు. ముహూర్తాలు చూసుకుని శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వారికి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో గడిచిన ఏడాదిలో ప్రసవ గణాంకాలు పరిశీలిస్తే అత్యధికంగా శస్త్రచికిత్సల ద్వారా జరిగినట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది.

సర్కారు సేవలకు పెరుగుతున్న ఆదరణ
గర్భ ధారణ నుంచి ప్రసవం వరకు నిర్వహించే అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నెలా టీకా ఇచ్చే క్రమంలో గర్భిణులకు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు.. ప్రభుత్వ వైద్య సేవలు, సుఖ ప్రసవం, ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకుంటే వచ్చే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. స్కానింగ్‌, ఇతర పరీక్షలు అందుతుండటంతో క్రమంగా సర్కారు దవాఖానాకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతోంది. సుఖ ప్రసవాలపై మానసిక పరిపక్వత సాధించేలా యోగా, వ్యాయామం వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు.

నాలుగింట మూడొంతులు కోతలే
ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైరిస్క్‌ పేరిట.. ప్రైవేటులో డబ్బులకు కక్కుర్తి పడి ఎక్కువగా ప్రసవాలకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో గడిచిన ఏడాదిలో 10,832 ప్రసవాలు నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వ దవాఖానాలో 6,793, ప్రైవేటులో 4,039 జరిగాయి. అయితే ప్రభుత్వంలో 2,101, ప్రైవేటులో కేవలం 279 సాధారణ ప్రసవాలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 2,380 సుఖ ప్రసవాలు(21.97 శాతం), 8,452 శస్త్రచికిత్స(78.02 శాతం) కాన్పులు జరిగాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తేనే కడుపు కోతల పరిస్థితి స్పష్టమవుతోంది.

గోడ పత్రికలతో చైతన్యం
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స కాన్పులు తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ప్రసవాలకు ముహూర్తాలు చూడరాదని ఆసుపత్రులు, ఆలయాల్లో గోడ పత్రికలను ప్రదర్శించనున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజువారీగా జరిగే ప్రసవాల సంఖ్యను నమోదు చేస్తున్నారు. శస్త్రచికిత్స ప్రసవం జరిగితే కారణాలు తెలుసుకునేలా ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించారు.


ఇతర సమస్యలుంటే ఒత్తిడి తెస్తున్నారు
-డాక్టర్‌ లీలావతి, స్త్రీవైద్య నిపుణులు, పెద్దపల్లి

గర్భిణి ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవాలు నిర్వహిస్తున్నాం. మధుమేహం, రక్తపోటు, ఆయాసం, ఇతర అనారోగ్య సమస్యలుంటే శస్త్రచికిత్స చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. సహజ ప్రసవాల కోసం యోగా, వ్యాయామం, ఇతర ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నాం.


ప్రభుత్వానికి సహకరిస్తాం
శ్రీనివాసాచార్యులు, బ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రకృతికి విరుద్ధంగా ఏ పనీ చేయరాదు. ప్రసవాలకు ముహూర్తాలు నిర్ణయించడం లేదు. ప్రసవం జరిగిన తర్వాత ఏదైనా దోషాలుంటే నివారించుకోవాలని మాత్రమే సూచిస్తున్నాం. వైద్యుల సలహాలు పాటించాలి. కాన్పు ముహూర్తాలు వద్దంటూ యూట్యూబ్‌లో చైతన్యం చేస్తున్నా. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం.


అవగాహన కల్పిస్తున్నాం
డా.ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతం పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. మా సిబ్బంది ప్రైవేటులో నమోదయ్యే కాన్పుల వివరాలను రోజువారీగా సేకరిస్తున్నారు. శస్త్రచికిత్సలను ప్రోత్సహించవద్దంటూ అవగాహన కల్పిస్తున్నాం. సంబంధిత శాఖలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని