logo

అధ్యాపకుల ప్రచారబాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు నిర్వహించే బడిబాట తరహాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాల పెంపే లక్ష్యంగా జిల్లాలోని అధ్యాపకులు ప్రచారబాట పట్టారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

Published : 25 Jun 2022 06:42 IST

ఇంటర్‌లో ప్రవేశాల పెంపే లక్ష్యం
న్యూస్‌టుడే, మెట్‌పల్లి

సారంగాపూర్‌లో అధ్యాపకుల ప్రచారం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు నిర్వహించే బడిబాట తరహాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాల పెంపే లక్ష్యంగా జిల్లాలోని అధ్యాపకులు ప్రచారబాట పట్టారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన కాలపట్టికను ప్రకటించింది. ఈ నెల 20 నుంచి జులై 20 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నమోదు చేసుకోవాలని, జులై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది.
ఇంటింటికీ తిరుగుతూ..
నోడల్‌ అధికారి సూచనల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరడంవల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. వాటికి సంబంధించి ముద్రించిన కరపత్రాలు అందిస్తూ ప్రచారం చేస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గడంతో ప్రత్యక్ష తరగతులు సజావుగా జరుగుతాయని, చదువులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తే అవకాశాలు లేవని పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు నమోదు చేసుకోవాలని చెప్పడంతోపాటు వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. పదోతరగతి ఫలితాలు వెలువడిన వెంటనే కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకున్న విద్యార్థులు ఉత్తీర్ణులైతే వారి వివరాలను అంతర్జాలంలో నమోదు చేయనున్నారు.
మూడు వేల మందికి అవకాశం
జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వృత్తి విద్యాకోర్సులు బోధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 3 వేలకు పైగా విద్యార్థులు చేరే అవకాశముంది. జిల్లాలో ఏప్రిల్‌లో నిర్వహించిన పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 11,826 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరి ఇళ్లకు వెళ్లి అధ్యాపకులు అవగాహన కల్పిస్తూ ప్రవేశాల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నారు.

నాణ్యమైన విద్య..
-నారాయణ, జిల్లా నోడల్‌ అధికారి, జగిత్యాల

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. అధ్యాపకులు పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకోవడంవల్ల కలిగే ప్రయోజనాలు, అందించే నాణ్యమైన ఉచిత విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొంది వసతులను సద్వనియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని