logo

నేటి నుంచి దళితబంధు లబ్ధిదారుల ఎంపిక

దళితబంధు పథకానికి 1500 మంది లబ్ధిదారులను ఈ నెల 28వ తేదీ నుంచి జులై 10 వరకు ఎంపిక చేసి 11న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

Published : 28 Jun 2022 05:14 IST

మంత్రి గంగుల కమలాకర్‌

 
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు బాలకిషన్‌, రవిశంకర్‌, సతీష్‌బాబు,
ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: దళితబంధు పథకానికి 1500 మంది లబ్ధిదారులను ఈ నెల 28వ తేదీ నుంచి జులై 10 వరకు ఎంపిక చేసి 11న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. సోమవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 13,359 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 10,202మందికి యూనిట్లు మంజూరు చేశామని ఇంకా 3,357మందికి యూనిట్లు మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. దళితబంధు పథకంతో భవిష్యత్తు తరాలు ఉన్నత వర్గాలకు దీటుగా ఎదుగుతారని తెలిపారు. పథకం పారదర్శకంగా అమలు చేసినందుకు జిల్లా పాలనాధికారి ఆర్‌వీ.కర్ణన్‌ను మంత్రి అభినందించారు. జిల్లా పాలనాధికారి ఆర్‌వీ. కర్ణన్‌ మాట్లాడుతూ..హుజురాబాద్‌ నియోజకవర్గంలో 17,554 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు చెప్పారు.

యూనిట్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌ రెడ్డిని జిల్లా పాలనాధికారి అభినందించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ మాట్లాడుతూ... డెయిరీ యూనిట్ల లబ్ధిదారుల కోసం గేదెలను తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తీసుకురావాలన్నారు.

రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సమీక్ష

మంత్రి గంగుల కమలాకర్‌ రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సమీక్షించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 3వేలు, కరీంనగర్‌లో 1400, మానకొండూర్‌లో 891, చొప్పదండి నియోజకవర్గంలో 707 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా 789 నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో సమావేశం ఉందని జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో 707 ఇళ్లు మంజూరయ్యాయని ఇళ్ల నిర్మాణం మొదలైన వాటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. గంగాధర ఎక్స్‌రోడ్‌ వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్లను బాగు చేయాలని కోరారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌బాబు మాట్లాడుతూ.. సైదాపూర్‌, చిగురుమామిడి మండలాల్లో 247 రెండు పడక గదుల ఇళ్లకు 243 పూర్తయినట్లు చెప్పారు. సైదాపూర్‌లో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో 30వేల రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా పట్టణంలో 1214, జమ్మికుంటలో 500 వీణవంక మండలంలో 59, ఇల్లందకుంటలో 50 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. సమావేశంలో కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌, సుడా ఛైర్మన్‌ జీవీ.రామకృష్ణా రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా అదనపు పాలనాధికారులు గరిమాఅగ్రవల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు