logo

మురుగు వెళ్లేదెలా?

నగర వ్యాప్తంగా ఉన్న ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరంతా పరుగులు పెడుతూ రెండు ప్రధాన కాల్వల గుండా మానేరు నదిలో కలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ నీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేయాలని భావిస్తుండగా..ఆ నీటికి దారులు

Published : 07 Jul 2022 03:03 IST

మానేరులో గోడల నిర్మాణంతో సమస్య
మళ్లింపుపై ఆలోచన చేస్తే ప్రయోజనం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

మురుగు ఆగకుండా నదిలో వేసిన పైపులు

గర వ్యాప్తంగా ఉన్న ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరంతా పరుగులు పెడుతూ రెండు ప్రధాన కాల్వల గుండా మానేరు నదిలో కలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ నీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేయాలని భావిస్తుండగా..ఆ నీటికి దారులు మూసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. మానేరులో గోడల నిర్మాణం చేస్తుండటంతో భవిష్యత్తులో అందులోకి మురుగు నిలిపి వేస్తే నగరం నుంచి వచ్చే నీరంతా ఎలా మళ్లిస్తారనేదీ ప్రశ్నార్థకంగా మారింది.

కరీంనగర్‌ నగరాన్ని అన్ని హంగులతో ఆకర్షణీయంగా.. మానేరు నది వెంబడి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తీగల వంతెన పూర్తి కాగా అప్రోచ్‌ రోడ్డు పనులు చేస్తుండగా.. మరోవైపు రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణం కోసం రిటర్నింగ్‌ వాల్స్‌ కడుతున్నారు. పక్కనే ఉన్న డంపింగ్‌యార్డు సైతం ఖాళీ చేస్తుండగా.. నగర వీధుల్లోంచి వచ్చే లక్షల లీటర్ల మురుగునీరంతా మానేరులోనే ప్రవహిస్తోంది.

మానేరు నదిలో నిల్వ ఉన్న మురుగు, వరద

రెండు ప్రధాన నాలాలు
నగరంలోని ఎగువ ప్రాంతాల నుంచి మొదలుకొని దిగువ ప్రాంతాల వరకు ఉన్న ఇళ్ల నుంచి వచ్చే మురుగు రెండు ప్రధాన నాలాల ద్వారా మానేరులోకి చేరుతోంది. అశోక్‌నగర్‌, గణేశ్‌నగర్‌ బైపాసు రోడ్డులో ఉండే వరదకాల్వలు కీలకం కాగా.. ప్రతిరోజు సుమారు 35ఎంఎల్‌డీల మురుగు బయటకు వస్తుండగా ఇదంతా శుద్ధీ చేయడం సవాల్‌గా మారింది. శుద్ధీ చేసినా, చేయకపోయినా ఈ నీరంతా మానేరులోనే కలుస్తుండగా ప్రస్తుతం రివర్‌ ఫ్రంట్‌లో భాగంగా గోడల నిర్మాణం జరుగుతుండగా భవిష్యత్తులో ఆ దారులన్నీ మూసుకుపోతే మురుగునీరు ఎక్కడికి వెళ్తుందో తెలియని గందరగోళం నెలకొంది.

శుద్ధి చేసిన నీటికి కూడా..
వ్యర్థ నీటిని పునర్వినియోగం చేసుకునేందుకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో కార్యాచరణ తీసుకున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే భూగర్భ మురుగునీటి శుద్ధీ కేంద్రం ఉంది. దీనికి తోడుగా అదనంగా రెండు చోట్ల నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు. కోతిరాంపూర్‌లో 14.9 ఎంఎల్‌డీలు, జ్యోతినగర్‌లో 13.3ఎంఎల్‌డీల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. ఈ పనులు పూర్తయితే శుద్ధి చేయడం ద్వారా వచ్చే నీరు కూడా నదిలోకే వదలాల్సి ఉంటుంది.

ఆరు కిలోమీటర్ల మళ్లింపు ఎలా?
మురుగు ప్రస్తుతం నేరుగా మానేరులో కలుస్తుండగా మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల్లో భాగంగా రిటర్నింగ్‌ వాల్‌ కడుతున్నారు. మురుగునీరు గోడ వెనుకాలే నిల్వ ఉండి దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంటుంది. పర్యాటక ప్రాంతం కావడంతో దుర్గంధం ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నీటిని పంపించాలంటే గణేశ్‌నగర్‌ బైపాసు నుంచి వచ్చే మురుగునీరు 4.5 కిలో మీటర్లు, అశోక్‌నగర్‌ నాలా నుంచి వచ్చే నీటిని 1.5కిలోమీటర్లు దూరం పంపించాల్సి ఉంటుంది. మొత్తం ఆరు కిలోమీటర్ల దూరం మళ్లింపు చేయాల్సి ఉండగా ఆ పనులపై అధికారుల దగ్గరి నుంచి స్పష్టత లేకుండా పోయింది. ఒకవేళ మళ్లింపు వదిలేస్తే రెండు చోట్ల నుంచి మురుగు, వరదనీరంతా ఈ పరిసరాల్లోనే నిలిచి దారుణంగా మారనుంది. ఇప్పటికే పనులు ప్రారంభించడంతో పెద్ద పైపులు వేసి నదిలోకి నీటిని పంపిస్తున్నారు. సమస్య తీవ్రం కాకముందే దీనిపై ఆలోచన చేస్తే మురుగునీరు మళ్లింపునకు పరిష్కారం లభించనుంది.


డైవర్షన్‌ చేయాలని కోరాం
- వై.సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌

మానేరు రివర్‌ ఫ్రంట్‌ సివిల్‌ వర్క్‌ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లోనే వరదనీరు వెళ్లేందుకు డైవర్షన్‌ చేయాలని కోరడం జరిగింది. సమస్య రాకుండా పనులు చేస్తారనే నమ్మకం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని