logo

గడువు సమీపం.. లక్ష్యానికి దూరం

ప్రభుత్వానికి బియ్యం అప్పగించే విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. కేటాయిస్తున్న ధాన్యం, తిరిగి అప్పగించాల్సిన బియ్యం పరిమాణంలో వ్యత్యాసాల వల్ల ఉమ్మడి జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.

Published : 28 Nov 2022 03:40 IST

ఉమ్మడి జిల్లాలో అస్తవ్యస్తంగా సీఎంఆర్‌ ప్రక్రియ

బియ్యం అప్పగింతపై మిల్లర్ల నిర్లక్ష్యం.. 2 నుంచి ఎఫ్‌సీఐ తనిఖీలు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

సుల్తానాబాద్‌ మిల్లులో బియ్యం రాశులు

ప్రభుత్వానికి బియ్యం అప్పగించే విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. కేటాయిస్తున్న ధాన్యం, తిరిగి అప్పగించాల్సిన బియ్యం పరిమాణంలో వ్యత్యాసాల వల్ల ఉమ్మడి జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.

ఈ ఏడాది జూన్‌లో ఎఫ్‌సీఐ అధికారులు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం తీసుకున్న ధాన్యానికి అనుగుణంగా నిర్ణీత ప్రమాణాలతో కూడిన బియ్యాన్ని అప్పగించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో మిల్లర్లు  సీఎంఆర్‌ ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం అత్యాధునిక యంత్రాలు సమకూర్చుకోవడంతో పాటు ధాన్యం అప్పగింతలో ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ నిబంధనలు పాటించాలని, బియ్యాన్ని అక్రమంగా విక్రయించవద్దని ప్రభుత్వం షరతులు విధించడంతో తిరిగి జులై నుంచి సీఎంఆర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబరు 2 నుంచి ఎఫ్‌సీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయనుండటంతో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

సీఎంఆర్‌ కింద మర పట్టేందుకు సిద్ధంగా ధాన్యం బస్తాలు

పునర్వినియోగం.. గడువుపై ఒత్తిడి

మిల్లర్లు సీఎంఆర్‌ కింద తీసుకుంటున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. దళారుల వద్ద రేషన్‌ బియ్యాన్ని కిలోకు రూ.20కి కొనుగోలు చేసి సీఎంఆర్‌ కింద పౌరసరఫరాల శాఖకు పెడుతుండగా నాణ్యత లేదని ఎఫ్‌సీఐ అంగీకరించడం లేదు. యాసంగిలో కేవలం ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ స్పష్టం చేయడంతో మిల్లర్లు ఖంగుతిన్నారు. అనంతరం ఉప్పుడు బియ్యం సేకరణకు అంగీకరించినప్పటికీ మిల్లుల్లో లెక్కలకు అనుగుణంగా ధాన్యం నిల్వలు లేవు. సీఎంఆర్‌ అప్పగింతకు నవంబర్‌ 30 వరకు గడువుండటం, ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలుండటంతో మిల్లర్లు వణికిపోతున్నారు. గడువు పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.


ఎగవేతదారులపై చర్యలేవీ!

నిబంధనల మేరకు సీఎంఆర్‌ కింద కేటాయించిన క్వింటాలు ధాన్యానికి మిల్లర్లు 67 కిలోల చొప్పున బియ్యాన్ని ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలకు అప్పగించాలి. ధాన్యాన్ని మర ఆడించినందుకు ప్రభుత్వమే మిల్లింగ్‌ ఖర్చులు చెల్లిస్తుంది.

గత వానాకాలం, యాసంగి సీజన్‌లలో సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 402 మిల్లులకు అప్పగించింది. మిల్లర్లకు ధాన్యం కేటాయింపు పక్రియలో పౌరసరఫరాల శాఖ ఎలాంటి పూచీకత్తు తీసుకోదు. కేవలం వారితో ఒప్పంద పత్రం మాత్రమే రాయించుకుంటోంది.

దీంతో సీఎంఆర్‌ ఎగవేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం చట్టప్రకారంగా చర్యలు తీసుకోలేకపోతోంది. చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న మిల్లర్లు మరాడించిన బియ్యాన్ని బహిరంగ విపణిలో కిలోకు రూ.30 చొప్పున విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.

మిల్లుల్లో బియ్యం బస్తాలను అస్తవ్యస్తంగా వేయడం, కుప్పలుగా పోయడంతో తనిఖీలు చేయడం సాధ్యం కాలేదు. నిల్వలు తక్కువగా ఉన్న మిల్లుల వివరాలు ఇచ్చి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌సీఐ పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసినా నోటీసులతో సరిపెడుతున్నారు.


పేరుకుపోతున్న నిల్వలు

ఉమ్మడి జిల్లాలో 2021-22 వానాకాలంలో 1,400 కేంద్రాల్లో రూ.2 వేల కోట్ల విలువైన 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు.

క్వింటాలుకు 67 కిలోల చొప్పున 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అప్పగించారు. కేవలం 48 శాతం మాత్రమే సీఎంఆర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ సీజన్‌కు గాను సుమారు 5.5 లక్షల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది.

2021-22 యాసంగిలో మొత్తం 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి మిల్లులకు తరలించగా 4.94 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. అంటే 38 శాతం మాత్రమే పూర్తి చేశారు. 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు అప్పగించాల్సి ఉంది.

పాత బియ్యం అప్పగించకముందే ఈ వానాకాలానికి సంబంధించి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,250 కేంద్రాల్లో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 130 మిల్లులకు తరలించారు.

ఇప్పటికే ఉన్న పాత నిల్వలు, కొత్తగా చేరిన ధాన్యంతో మిల్లులు నిండిపోయాయి. సుల్తానాబాద్‌, పెద్దపల్లి, మంథని, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల ప్రాంతాల్లో మిల్లుల ఆవరణల్లోని ఖాళీ స్థలంలోనూ బస్తాలు వేశారు.


బకాయి లేని మిల్లులకే కేటాయింపు

-వెంకటేశ్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పెద్దపల్లి  

గతంలో కేటాయించిన సీఎంఆర్‌ పూర్తిగా అప్పగించిన మిల్లులకే ఈ వానాకాలంలో ధాన్యాన్ని కేటాయిస్తున్నాం. డిసెంబరు 2 నుంచి ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. బియ్యం అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని