logo

మాజీ మావోయిస్టు అరెస్టు

మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, పేలుడు పదార్థాలను చేరవేస్తున్న మాజీ మావోయిస్టును అరెస్టు చేసినట్లు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

Updated : 25 Jan 2023 05:47 IST

కాటారం, న్యూస్‌టుడే: మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, పేలుడు పదార్థాలను చేరవేస్తున్న మాజీ మావోయిస్టును అరెస్టు చేసినట్లు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్సై సుధాకర్‌, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మండలకేంద్రంలోని బొప్పారం క్రాస్‌ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తూ పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొన్నట్లు చెప్పారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన పొలం రాజయ్య(48) మిషన్‌ భగీరథలో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో పెద్దపల్లి ఏరియా దళంలో పనిచేశాడు. వివాహం అనంతరం దుమ్మాటి అర్జున్‌ అలియాస్‌ నాగన్న, అతని భార్య నిర్మల కమాండర్‌గా ఉన్న దళంలో చేరగా కంకణాల రాజిరెడ్డి ఆలియాస్‌ వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం పాత వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాకు సంబంధించి జగన్‌ వద్ద ప్లాటూన్‌ కమాండర్‌గా చేరాడు. 2002లో లొంగిపోయిన రాజయ్య ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం కలిసిరాక ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో మళ్లీ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో గతంలో పరిచయమైన మావోయిస్టు ప్రతినిధి రాజిరెడ్డిని నాలుగు నెలల కిందట ఫోన్లో మాట్లాడి మళ్లీ చేరేందుకు ఒప్పుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయసాగాడు. అప్పటి నుంచి భావజాలం ఉన్న వ్యక్తులను కలుస్తూ పార్టీలో చేరేలా ప్రోత్సహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజిరెడ్డి సూచన మేరకు మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై మావోయిస్టు సాహిత్య కరపత్రాలు, మందుగుండు సామగ్రిని తీసుకొని ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుకు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విప్లవ సాహిత్య కరపత్రాలు, నాలుగు జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, చరవాణి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని రాజయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై సుధాకర్‌, సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని