logo

సరికొత్తగా.. సర్కారు బడులు

జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కార్పొరేట్‌ పాఠశాలలను తలపిస్తున్నాయి.

Published : 01 Feb 2023 04:53 IST

జిల్లాలో 15 చోట్ల సిద్ధం చేసిన అధికారులు

సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల

న్యూస్‌టుడే, సిరిసిల్ల(విద్యానగర్‌), ఎల్లారెడ్డిపేట: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కార్పొరేట్‌ పాఠశాలలను తలపిస్తున్నాయి. సర్కారు బడుల అభివృద్ధే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మొదటి విడతగా పలు పాఠశాలల్లో మూత్రశాలలు, డ్యూయల్‌ డెస్క్‌లు, గ్రీన్‌బోర్డులు తదితర కనీస సౌకర్యాలను కల్పించారు. దీంతో సర్కారు బడుల రూపురేఖలు మారిపోయాయి. వీటిని నేడు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో  అధికారులు అందుకు సిద్ధం చేశారు.

జిల్లాలో మొత్తం 511 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అనేక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకోగా మరికొన్నింటిలో కనీస సౌకర్యాలు మృగ్యమయ్యాయి. సర్కారు బడుల్లో అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో మొదటి విడతగా జిల్లాలో 172 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిని ఆధునికీకరించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పనులన్నీ పూర్తిచేసుకొని నేడు జిల్లాలోని 15 పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేశారు. విద్యుత్తు సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు, హ్యాండ్‌వాష్‌, ఫ్లోరింగ్‌, గ్రీన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు గ్రంథాలయం, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లను నిర్మించారు. మొదటి విడత ఎంపిక చేసిన వాటిలో దాదాపు 60 పాఠశాలల్లో 60 నుంచి 70 శాతం పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని పనులు పూర్తయితే జిల్లాలోని మరికొన్ని పాఠశాలలను రెండో విడత కార్యక్రమానికి ఎంపిక చేయనున్నారు. పనులు వేగంగా సాగితే జిల్లాలోని సర్కారు బడులు నూతన శోభ సంతరించుకుని కార్పొరేట్‌కు దీటుగా మారనున్నాయి.

ప్రారంభోత్సవానికి సిద్ధమైన బండలింగంపల్లిలోని ప్రాథమిక పాఠశాల

పూర్తి చేసినవి...

బోయినపల్లి మండలంలోని అనంతపల్లి, చందుర్తి మండలంలోని జోగాపురం, చందుర్తి మండలంలోని రామారావుపల్లి, గంభీరావుపేట మండలంలోని గజసింగవరం, గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల, ముస్తాబాద్‌ మండలంలోని మోహినికుంట, రుద్రంగి మండలంలోని మానాల అడ్డాబోరుతండా, రుద్రంగి ఎస్సీ కాలనీ, తంగళ్లపల్లి మండలంలోని ఆర్టిసన్‌ కాలనీ, వేములవాడ మండలంలోని చీర్లవంచ, వేములవాడ గ్రామీణం మండలంలోని మర్రిపల్లి ఎంపీపీఎస్‌లను సిద్ధం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, వేములవాడ మండలంలోని నాంపల్లి ఎంపీయూపీఎస్‌లను ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని