logo

ప్రాణం తీసిన ఇసుక తరలింపు వివాదం

ఇసుక లారీల రాకపోకలతో పంటలు దెబ్బతింటున్నాయంటూ రైతు వాటిని అడ్డుకోగా ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో అతడి తండ్రి హఠాన్మరణం చెందిన ఘటన సుల్తానాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది.

Published : 05 Feb 2023 05:03 IST

రీచ్‌ నిర్వాహకులతో గొడవ.. వృద్ధుడి హఠాన్మరణం

కనుకయ్య

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: ఇసుక లారీల రాకపోకలతో పంటలు దెబ్బతింటున్నాయంటూ రైతు వాటిని అడ్డుకోగా ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో అతడి తండ్రి హఠాన్మరణం చెందిన ఘటన సుల్తానాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం సుల్తానాబాద్‌ మండలం కదంబాపూర్‌ వద్ద మానేరు వాగులో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తరలించే వాహనాలు తొగర్రాయి పంచాయతీ పరిధి జెండాపల్లికి చెందిన చెంచు శ్రీనివాస్‌ పొలం పక్క నుంచి వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఇసుక లారీల వల్ల దుమ్ము లేచి తమ పొలంలోని పంటలపై పడి దిగుబడులు తగ్గుతున్నాయని, రీచ్‌ నిర్వాహకులు కనీసం నీళ్లు కూడా చల్లించడం లేదని శ్రీనివాస్‌ శుక్రవారం సాయంత్రం లారీలను అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ నిర్వాహకులతో వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌ తండ్రి కనుకయ్య(60) ఘటనా స్థలానికి చేరుకొని కొడుకును దుర్భాషలాడుతున్న వారిని వారించాడు. వాగ్వాదం చోటుచేసుకొని కనుకయ్య శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకెళ్లారు. కొద్ది సేపటికి అతడు కుప్పకూలి మృతి చెందాడు. అప్పటికే చీకటి పడటంతో ఊరకుండిపోయిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయం మృతదేహాన్ని ఇసుక రీచ్‌ వద్దకు తరలించి ఆందోళన చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. మృతుడు కనుకయ్యకు భార్య కనుకమ్మ, కుమారుడు శ్రీనివాస్‌ ఉన్నారు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఇసుక రీచ్‌ నిర్వాహకులు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయమై సుల్తానాబాద్‌ పోలీసులను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా వృద్ధుడు మృతి చెందిన ఘటనపై తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని