logo

భాషా పండితుల నిరసన.. నిలిచిన బోధన

జిల్లాలోని భాషా పండితులు, పీఈటీలు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాషా పండితుల కేసు కోర్టు పరిధిలో ఉంది.

Published : 08 Feb 2023 06:14 IST

9, 10 తరగతుల విద్యార్థులకు ఇబ్బందులు
న్యూస్‌టుడే, సిరిసిల్ల(విద్యానగర్‌)

డీఈవో రాధాకిషన్‌కు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

జిల్లాలోని భాషా పండితులు, పీఈటీలు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాషా పండితుల కేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులు, పీఈటీలు తీవ్ర నిరాశలో పడ్డారు. ఏళ్లు గడుస్తున్నా పండితుల అప్‌గ్రేడేషన్‌ సమస్య అలానే మిగిలిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం అందించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత గానీ భాషా పండితుల సమస్యలు పరిష్కారం కాలేదు. తమకు కూడా ఇదే షెడ్యూల్‌లో పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వారు నిరసన బాట పట్టారు.

జిల్లాలో 95 హిందీ, 100 తెలుగు పండిట్లు, 46 మంది పీఈటీలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్ స్థాయి ఉన్న వారే టీచర్లుగా పాఠాలు బోధించాలి. గత కొన్నేళ్ల నుంచి ఉన్నత పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఉర్దూను గ్రేడ్‌-2 భాషా పండితులతో బోధిస్తూ పండితులను శ్రమ దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వేతనం మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఎన్‌జీటీలతో సమానంగా ఇస్తున్నారని, తమ వద్ద చదువుకున్న విద్యార్థులే ఉపాధ్యాయులుగా వచ్చి తమకే ప్రధానోపాధ్యాయులుగా మారుతున్నారని వాపోతున్నారు. పండిట్ గ్రేడ్‌-2గా పని చేసి ఎలాంటి పదోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని భాషా పండితులు నిరసన బాట పట్టారు. జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సిరిసిల్లలో అంబేడ్కర్‌చౌక్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ నెల 1 నుంచి భాషా పండితులు 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో భాషా పండితులు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వారికి సిలబస్‌ పూర్తయినప్పటికీ సందేహాల నివృత్తికి భాషా పండితులు అందుబాటులో లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. 9వ తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తికాలేదు.

బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్న భాషా పండితులు


హిందీ ఉపాధ్యాయులు లేక..

కు హిందీ ఉపాధ్యాయులు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఓవైపు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో పాఠాల పునరుశ్ఛరణ, సందేహాల నివృత్తికి వారు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు మా సమస్యలను పరిష్కరించాలి.

మీనాక్షి, పదో తరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, ఆవునూర్‌


సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి

భాషా పండితులందరినీ అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతులు కల్పిస్తామని ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. హామీ నెరవేరనందున పాఠశాలల్లో బోధన నిలిపివేశాం. భాషా పండితులను శ్రమ దోపిడీకి గురిచేయడం సరికాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలి. భాషా పండితులను అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతులు కల్పించాలి.

గోనె బాల్‌రెడ్డి, రాష్ట్రీయ పండిత పరిషత్‌, జిల్లా అధ్యక్షుడు


పదోన్నతులు కల్పించాలి

ప్రభుత్వం భాషా పండితులు, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతులు కల్పించాలి. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి.

ప్రభాకర్‌, పెటా జిల్లా అధ్యక్షుడు


పిల్లలు ఆందోళన చెందవద్దు

జిల్లాలోని భాషా పండితులు నిరసన బాట పట్టడంతో 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన నిలిచిపోయింది. పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తయింది. అందువల్ల ఇబ్బంది లేదు. సందేహాల నివృత్తి ఇతర ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దు.

డి.రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని