logo

నామమాత్రంగా వార్డు కమిటీలు

పాలకవర్గం, అధికార యంత్రాంగంతోపాటు పట్టణ వాసులను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం పురపాలికల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసింది.

Published : 26 Mar 2023 05:05 IST

సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలో కనిపించని చొరవ

పట్టణంలో మురుగు కాల్వ దుస్థితి

రాయికల్‌ పట్టణం, న్యూస్‌టుడే: పాలకవర్గం, అధికార యంత్రాంగంతోపాటు పట్టణ వాసులను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం పురపాలికల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసింది. వార్డుల్లో ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో, దాన్ని ఏవిధంగా పరిష్కరించాలో ప్రజల తరఫున పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారే వార్డు కమిటీ సభ్యులు. స్థానిక ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన వార్డు కమిటీలను అధికారులు పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పట్టణాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించాల్సిన వార్డు కమిటీలు కొంతకాలంగా నిస్తేజంగా ఉండిపోయాయి. దీంతో క్షేత్రస్థాయిలో వార్డుల్లో మౌలికవసతులకు సరైన ప్రణాళికలు నిర్వహించడం లేదు. రెండేళ్ల క్రితం వార్డు కమిటీలను నియమించినపుడు హడావుడి చేసినా ఆతర్వాత వార్డు కమిటీలు నామమాత్రం అయ్యాయి. పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కమిటీల పాత్ర లేకపోవడంతో సమస్యలు ప్రాధాన్య క్రమంలో పరిష్కారం కావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డు కమిటీలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు

వార్డుకు నాలుగు కమిటీలు ఉంటాయి. మొదటి కమిటీలో స్థానిక యువత, రెండో కమిటీలో మహిళలు, మూడో కమిటీలో విశ్రాంత ఉద్యోగులు, సీనియర్‌ సిటీజన్స్‌ నాలుగో కమిటీలో పుర ప్రముఖులు, మేధావులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఉంటారు. పట్టణంలో సుమారు 20 వేల జనాభా ఉండగా ఒక్కో వార్డుకు 4 కమిటీల వంతున 12 వార్డులకు మొత్తం 48 వార్డు కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరితో ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం జరిపి కమిటీ సభ్యుల సూచనలతో వార్డుల్లో పనులు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా వార్డు కమిటీ సభ్యులతో చర్చించి పాలకవర్గం ఆమోదించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అందుకే ఆయా కమిటీల్లో ఎంపికైన వారు స్థానిక సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అంతర్గత రోడ్ల నిర్మాణం, మురుగు కాల్వలు, వీధి దీపాల నిర్వహణ, రహదారుల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, సాధారణ మరమ్మతులు వంటి అంశాలను పరిష్కరించేందుకు వార్డు కమిటీ సమావేశాలు జరిపి వాటి పరిష్కారానికి పాలకవర్గం కృషి చేయాలి. కాని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కమిటీలు నామమాత్రమయ్యాయి.


బలోపేతం చేస్తాం

గత సంవత్సరం జూన్‌, డిసెంబర్‌ నెలల్లో వార్డు సమావేశం నిర్వహించి సభ్యుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాం. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిబంధనల మేరకే నిర్వహిస్తున్నాం. వార్డు కమిటీ సభ్యులను స్థానిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు చేయడంతోపాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తాం. వార్డు కమిటీలను బలోపేతం చేసి చైతన్యవంతంగా తీర్చిదిద్దుతాం.

గంగుల సంతోష్‌కుమార్‌, కమిషనర్‌, రాయికల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని