logo

ఆత్మీయ సమ్మేళనం.. శ్రేణులకు నిర్దేశం

మంత్రి కేటీఆర్‌ సోమవారం జిల్లా పర్యటన ఆద్యంతం సందడిగా సాగింది. పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలపై అవగాహన కల్పిస్తూనే ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు.

Published : 28 Mar 2023 05:25 IST

సందడిగా మంత్రి కేటీఆర్‌ పర్యటన

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం: మంత్రి కేటీఆర్‌ సోమవారం జిల్లా పర్యటన ఆద్యంతం సందడిగా సాగింది. పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలపై అవగాహన కల్పిస్తూనే ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. తొలుత దుమాలలో రైస్‌మిల్లు ప్రారంభించాక కలెక్టరేట్‌కు వచ్చి పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో ప్రారంభించి చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. తరవాత భారాస జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. దీనికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. పార్టీ, కార్యకర్తలు లేకపోతే తమకు పదవులు లేవని, లక్షల మంది కష్టపడితే పిడికెడు మంది నాయకులవుతారని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో 1.72 లక్షల మందికి భారాస సభ్యత్వం ఉందని, ఆత్మీయ సమ్మేళనాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. తన పర్యటనలో ఆందోళన చేసిన వారి గురించి ప్రస్తావిస్తూ.. విద్యారంగం పరంగా సిరిసిల్ల ఒకప్పుడు, ఇప్పుడు పరిస్థితేంటో తెలుసుకోవాలన్నారు. వైద్య కళాశాల వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ఏం ఇవ్వని ప్రధాని మోదీ, కరీంనగర్‌ ఎంపీగా ఎన్నికై నాలుగేళ్లు అవుతున్నా ఏం అభివృద్ధి చేయని బండి సంజయ్‌ ముందు ఆందోళన చేయాలని సూచించారు. నిజాయతీ ఉంటే కాంగ్రెస్‌, భాజపా వాళ్లు కూడా తమకే ఓటు వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో   కరీంనగర్‌ ఎంపీగా వినోద్‌కుమార్‌ మళ్లీ పార్లమెంటుకు వెళ్లేలా చేద్దామన్నారు.

బలగం చూపిన మార్పు..

వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన బలగం సినిమాను నేను ఇంట్లో వీక్షిస్తుంటే కోనసీమను తలపించే దృశ్యాలను చూసి ఇది మీ సిరిసిల్లనేనా..! అని కుటుంబ సభ్యులు నాతో అంటూ ఆశ్చర్యపోయారని మంత్రి పేర్కొన్నారు.

అమెరికాలోనూ ఎన్నో సమస్యలు..

నేను అమెరికాలో ఏడెనిమిదేళ్లు ఉన్నా. అది బాగా అభివృద్ధి చెందిన దేశమని, భూతల స్వర్గమని చాలామంది చెబుతుంటారని, కానీ అక్కడ కూడా ఎన్నో రకాల సమస్యలున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భాజపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలున్న చోట కూడా ఇన్ని పనులు జరగలేదని తెలిపారు. 25-30 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనులను మనం చేశామని, ప్రజాప్రతినిధిగా ఏం చేశావని ఎవరైనా ప్రశ్నిస్తే గల్లా ఎగరేసి చేసిన పని చెప్పుకునే అవకాశం మనకే ఉందన్నారు.

పంచాయతీ అవార్డుల ప్రదానంలో...

ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పేపర్‌ లీకేజీ దురదృష్టకరమని, బాధ్యులపై చర్యలకు సిట్‌ విచారణ చేస్తుంటే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ ఆధారాలు సమర్పించేందుకు భయపడుతున్నారన్నారు. జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ఏప్రిల్‌లో పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ హనుమంతుడి గుడి లేని ఊరు, కేసీఆర్‌ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు.  బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీగా ఉండటం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు ఎమ్మెల్సీ రమణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్‌ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌, సెస్‌ ఛైర్మన్‌ చిక్కాల రామారావు, పార్టీ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌, రైబస జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు