logo

అడ్డగోలు బిల్లులు

కొండగట్టులో ఏటా నిర్వహించే ఆంజనేయస్వామి జయంత్యుత్సవాల్లో లక్షల్లో బిల్లులు చెల్లించడం, గుత్తేదార్లకు అధిక రేట్లకు పలు పనులు అప్పగించడం ఆరోపణలకు దారితీస్తోంది.

Updated : 18 May 2023 06:54 IST

జయంత్యుత్సవాల్లో అంచనాకు మించి వ్యయం  
న్యూస్‌టుడే, మల్యాల

అంజన్న ఆలయం

కొండగట్టులో ఏటా నిర్వహించే ఆంజనేయస్వామి జయంత్యుత్సవాల్లో లక్షల్లో బిల్లులు చెల్లించడం, గుత్తేదార్లకు అధిక రేట్లకు పలు పనులు అప్పగించడం ఆరోపణలకు దారితీస్తోంది. కొండగట్టు అంజన్న ఆలయంలో ఏప్రిల్‌ 6, మే 14న నిర్వహించిన హనుమాన్‌ జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అధికారులు దాదాపు కోటి రూపాయలు వెచ్చించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రివైజ్డ్‌ పేరుతో పనుల అప్పగింత

ఉత్సవాల్లో గతంలో పనిచేసిన గుత్తేదార్లకు పనులు అప్పగించడం ఆనవాయితీగా మారింది. తర్వాత ‘రివైజ్‌’ పేరుతో రేట్లను రెండు నుంచి మూడు రెట్లు పెంచుతూ తమకు అనుకూలంగా ఉండే గుత్తేదార్లకు మేలు చేస్తూ తద్వారా ప్రయోజనం పొందుతుంటారన్న ఆరోపణలున్నాయి. ఆలయానికి రంగులు వేయడానికి దాదాపు రూ.2 లక్షల వరకు వెచ్చించినట్లు చెబుతున్న అధికారులు ఈసారి ఏకంగా రూ.5 లక్షలకు అప్పగించినట్లు పేర్కొనడం విశేషం. నాలుగేళ్ల కిందట ఓ భక్తుడు ఆలయానికి రంగులు వేయడానికి రూ.2 లక్షలు విరాళం అందించినా అధికారులు గుత్తేదారుకు బిల్లులు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం.

విద్యుత్తు దీపాలంకరణకు రూ.12 లక్షలు

ఆలయానికి విద్యుత్తు దీపాలంకరణ, ఫ్లడ్‌లైట్ల నిర్మాణం, ఆలయ పరిసరాల్లో, ఘాట్‌రోడ్డు వెంట, కొండగట్టు స్టేజీ వద్ద విద్యుత్తు దీపాలతో దేవతామూర్తులు, ఇతర బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఏకంగా రూ.12 లక్షలు వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ పరిధిలో పలువురు దాతలు స్వచ్ఛందంగా భోజనాలు, మజ్జిగ, నీళ్ల సరఫరా చేసినప్పటికీ అధికారులు కూడా నీటి సరఫరా, తదితర పనుల కోసం లక్షల్లో బిల్లులు రూపొందించారు.

పారిశుద్ధ్యానికి రూ.12 లక్షలు!

కొండగట్టులో పారిశుద్ధ్య సమస్య భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అధికారులు ఏకంగా రూ.12 లక్షల బిల్లులు రూపొందించి మంజూరుకు పంపించారు. ఆ అధికారి బిల్లులు చూసి అవాక్కయి తాను సంతకం చేయనని స్పష్టం చేయడంతో విషయం డీపీవో వరకు వెళ్లినట్లు సమాచారం.

తడికల పందిళ్లకు రూ.12 లక్షలు

ఆలయ పరిసరాల్లో తడికల పందిళ్ల ఏర్పాటుకు ఓ గుత్తేదారుకు రూ.12 లక్షలకు గుత్తపనులు అప్పగించడం పలు విమర్శలకు దారితీసింది. పందిళ్ల నిర్మాణంలో నాణ్యతలేని పాత తడికలు వినియోగించారని, అత్యధిక రేట్లకు గుత్తేదారుకు తడికల పందిళ్ల నిర్మాణం అప్పగించడంపట్ల కొందరు నాయకులు, మాజీ ధర్మకర్తలు దేవాదాయశాఖ కమిషనరు దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.

ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు..

వెంకటేశ్‌, ఆలయ ఈవో

ఆలయంలో వివిధ పనులకు సంబంధించిన పనులకు అంచనాలను ఇంజినీరింగ్‌ అధికారులు రూపొందిస్తారు. జయంత్యుత్సవాల సమయంలో వివిధ పనుల కోసం అధిక రేట్లతో బిల్లులు రూపొందించిన విషయమై ఇంజినీరింగు అధికారులే చూసుకోవాల్సి ఉంటుంది. కొండగట్టులో ఇంజినీరింగు అధికారి పనితీరు సరిగాలేదని, తమకు సహకరించడంలేదని ఇటీవలే దేవాదాయశాఖ కమిషనరుకు తెలియజేశాం. బిల్లుల మంజూరు విషయమై సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని