logo

సింగరేణి ఎన్నికల నగారా మోగేనా!

సింగరేణి ఎన్నికలకు యాజమాన్యం కోర్టులో విన్నవించుకున్న గడువు పూర్తి కావొచ్చింది. మార్చిలో ఎన్నికలు నిర్వహించలేమని మరో మూడు నెలలు గడువు కావాలని సింగరేణి యాజమాన్యం కోర్టులో తమ వాదనను వినిపించింది.

Published : 01 Jun 2023 05:37 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

సింగరేణి ఎన్నికలకు యాజమాన్యం కోర్టులో విన్నవించుకున్న గడువు పూర్తి కావొచ్చింది. మార్చిలో ఎన్నికలు నిర్వహించలేమని మరో మూడు నెలలు గడువు కావాలని సింగరేణి యాజమాన్యం కోర్టులో తమ వాదనను వినిపించింది. సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ కోర్టులో వేసిన పిటీషన్‌పై న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర కార్మికశాఖ ఉప కమిషనర్‌ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించాలని యాజమాన్యంతోపాటు జిల్లాల పాలనాధికారులకు లేఖలు పంపించారు. కార్మిక సంఘాలు కూడా ఎన్నికలకు సంబంధించి తమ సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే యాజమాన్యం మాత్రం మార్చిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, మూడు నెలల సమయం కావాలని కోరింది. కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్‌ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. జూన్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉత్పత్తికి పెద్దగా ప్రభావం పడదని, ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని యాజమాన్యం కోర్టులో తమ వాదనను వినిపించింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలు కూడా మూడు నెలలపాటు ఆగేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. ప్రస్తుతం యాజమాన్యం విన్నవించిన గడువు పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్ర కార్మికశాఖ ఉప కమిషనర్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

అధికార, ప్రతిపక్ష సంఘాలు సిద్ధం

ఎన్నికలకు ప్రస్తుత అధికార సంఘంతోపాటు ప్రతిపక్ష కార్మిక సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కార్మికుల సమస్యలపై యాజమాన్యం చర్చించేందుకు ముందుకు రావడం లేదని అధికారికంగా గుర్తింపు లేనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని తాజాగా తెబొగకాసం నాయకులు వెల్లడించారు. గుర్తింపు సంఘంగా గౌరవం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని తెబొగకాసం అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. ఇది వరకే ప్రతిపక్ష కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినా వారిని అధికారిక కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని సంఘాలను ఆహ్వానించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో జాతీయ కార్మిక సంఘాలతోపాటు ఇతర యూనియన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. సంఘాల వార్షిక నివేదికలు, నాయకత్వ పటిష్టత, కార్మికుల్లో పట్టు సాధించే దిశగా చర్యలు చేపట్టాయి.

గడువు ముగిసి నాలుగేళ్లు

సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి నాలుగేళ్లవుతుంది. ఎన్నికల అనంతరం గెలిచిన తెబొగకాసం నాయకులకు రెండేళ్ల కాలపరిమితికి కార్మికశాఖ అధికారపత్రం అందజేసింది. దీనిపై గుర్తింపు సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్ల కాలపరిమితికి అంగీకారం కుదిరిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన తర్వాత రెండేళ్లు ఏ విధంగా న్యాయమంటూ ప్రశ్నించిన తెబొగకాసం నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో వివాదం నడుస్తుండగానే కాలపరిమితి నాలుగేళ్లు గడిచిపోయింది. అయినా ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ ముందుకు రాలేదు. యాజమాన్యం సానుకూలత వ్యక్తం చేయలేదు.

* 2017 అక్టోబరు 5న సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెబొగకాసం గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. అధికారికంగా 2019 అక్టోబరుతో గడువు ముగియాలి. దీనిపై స్పష్టత లేకపోవడంతో నాలుగేళ్ల కాలపరిమితి(2021 అక్టోబరు)తో గడువు పూర్తి కావాలి. ఈ లెక్క ప్రకారం అయినా గడువు ముగిసి 19 నెలలు గడిచిపోయింది. ఎన్నికల నిర్వహణతో యాజమాన్యానికి కార్మిక సంఘాల మధ్య నెలకొంటున్న వివాదానికి తెరపడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని