logo

ప్రచార పర్వానికి కాంగ్రెస్‌ సిద్ధం!

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్‌  పార్టీ కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది.

Published : 18 Apr 2024 04:40 IST

మానకొండూర్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యనారాయణతో మాట్లాడుతున్న రాజేందర్‌రావు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్‌  పార్టీ కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ జిల్లా పార్టీ పక్షాన విడుదల చేసిన ప్రకటనలో మాత్రం కరీంనగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అని పేర్కొంటూ మానకొండూర్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొంటారని వివరించారు. సామాజిక మాధ్యమాలలో నేరుగా అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా సమావేశాల్లో మాత్రం తాను పాల్గొంటున్నట్లు రాజేందర్‌రావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఇప్పటికే భారాస, భాజపా అభ్యర్థులను ప్రకటించి చాలా రోజులైంది. తొలి విడత ప్రచారం కూడా ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రకటించడంలో జాప్యం చేస్తుండటంతో ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

21 వరకు మంత్రి సమక్షంలో నియోజకవర్గ సమావేశాలు...

అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం అయిన నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం రోజు నుంచే పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని స్థానిక నేతలు భావిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ల సమక్షంలో కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల స్థాయి సమీక్ష సమావేశాలు  ప్రారంభం కానున్నాయి. ఈనెల 18న ఉదయం డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూర్‌ (అలుగునూరు)లో మొదటి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం హుజూరాబాద్‌, 19న ఉదయం హుస్నాబాద్‌, మధ్యాహ్నం సిరిసిల్ల, 20న ఉదయం వేములవాడ, మధ్యాహ్నం చొప్పదండి, 21న ఉదయం కరీంనగర్‌ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొని ప్రచారంపై దిశా నిర్దేశం చేయనున్నారు. అధిష్ఠానం అభ్యర్థిని ప్రకటిస్తే పరిచయం చేస్తారు.

పార్టీని గెలిపించాలంటూ..

కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి సమావేశాలు ప్రారంభమయ్యే రోజు నాటికి ప్రకటించకపోతే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కాగా రాజేందర్‌రావు మాత్రం అన్ని నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటానని చెప్పారు. అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేసి పార్టీని గెలిపించుకుంటామని మంత్రి ప్రభాకర్‌ తెలిపారు. హైకమాండ్‌దే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు.

అసంతృప్తిపై చర్చ

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం టికెట్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆశిస్తున్నారు. ప్రచారంలో ఉన్నట్లు రాజేందర్‌రావుకు టికెట్‌ వస్తే ఆయన  మద్దతుదారుల స్పందన ఎలా ఉంటుందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక కరీంనగర్‌లో రెండు వర్గాలు అన్నట్లుగా పార్టీ వ్యవహారం కొనసాగుతుండటంపైనా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ప్రభాకర్‌ కరీంనగర్‌లో ఇటీవల చేపట్టిన నిరసన దీక్షలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిని వేదిక పైకి పిలవకపోవడంతో ఆయన కింద కూర్చొని దీక్షలో పాల్గొనాల్సి వచ్చిందని ఒక మైనార్టీ నాయకుడు సామాజిక మాధ్యమాల్లో తప్పు పట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో ప్రచారంలో వెనుకబడి ఉన్నామని.. అభ్యర్థిని ప్రకటించగానే అసంతృప్తి ఉన్న వారిని బుజ్జగించి ప్రచారం ఉరకలెత్తిస్తేనే ప్రత్యర్థులకు దీటుగా దూసుకెళ్లగలుగుతామని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని