logo

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 18 Apr 2024 04:46 IST

వేములవాడ: తలంబ్రాలు తీసుకొస్తున్న  జోగిని

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జోగినులు, శివపార్వతులు, భక్తులు సుమారు లక్ష మంది తరలి వచ్చారు. దీంతో కల్యాణ వేదిక, ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాజన్న ఆలయంలో బుధవారం ఉదయం శ్రీసీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులతో పాటు శ్రీలక్ష్మీ సమేత అనంతపద్మనాభస్వామి ఉత్సవమూర్తులకు స్థానాచార్యుడు భీమాశంకర్‌శర్మ, ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తులను పల్లకీలో కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం స్థానాచార్యుడితోపాటు ప్రధాన అర్చకుడు ఈశ్వరిగారి సురేశ్‌, ఉప ప్రధాన అర్చకుడు చంద్రగిరి శరత్‌ శర్మ, వేదపండితులు గణేశ్‌శర్మ, శివుడు తదితరులు శ్రీసీతారాముల కల్యాణం వేద మంత్రోచ్చారణల మధ్య ఉదయం 11.59 గంటలకు కనుల పండువగా జరిపించారు. 

ఇల్లందకుంటలో కల్యాణానికి  హాజరైన భక్తులు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే, యంత్రాంగం : జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దాదాపు అన్ని ఆలయాల్లో సీతారాముల కల్యాణాలు నిర్వహించారు. కరీంనగర్‌లో దాదాపు 40 ఆలయాల్లో జరిగిన వేడుకల్లో 2 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. కమిటీ నిర్వాహకులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ఒడి బియ్యం, పసుపు కుంకుమలు సమర్పించగా.. వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణోత్సవం నిర్వహించారు. పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో చిన జీయర్‌స్వామి, మహాశక్తి ఆలయంలో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, రాంనగర్‌ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌ దంపతులు, భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి మాధవి, వినోద్‌కుమార్‌ దంపతులు హాజరయ్యారు. అంజనాద్రి గుట్టపై, హెలిప్యాడ్‌ ప్రసన్నాంజనేయ స్వామి, జడ్పీ క్వార్టర్‌ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మేయర్‌ దంపతులు సునీల్‌రావు, అపర్ణలు పాల్గొన్నారు. జమ్మికుంట మండలం వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్‌ రామాలయ పూజల్లో ఎమ్మెల్సీ సురబీ వాణీదేవి పాల్గొన్నారు. వెదిర, ఉప్పరమల్యాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జమ్మికుంటలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు మొక్కులు తీర్చుకున్నారు.

పట్టువస్త్రాలు తీసుకొస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

ఇల్లందకుంటలో ఘనంగా..

ఇల్లందకుంట, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లందకుంటలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివార్లకు ఎదురుకోళ్ల అనంతరం కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సాయంత్రం స్వామివారిని శేషవాహనంపై ఊరేగించారు. అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, హుజూరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌జీ, ఆర్డ్‌వో రమేశ్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇద్దరు ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 ఎస్సైలు, 200 మంది సిబ్బంది పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు.

రాంనగర్‌ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, మాధవి దంపతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని