
పిల్లల వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీయూష్ గుప్తాను సన్మానిస్తున్న వైద్యులు
హొసపేటె, న్యూస్‌టుడే: కరోనా సమయంలో దేశంలోనే వైద్యులందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కరోనా బారి నుంచి కాపాడారని పిల్లల వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పీయూష్ గుప్తా అభివర్ణించారు. కర్ణాటక పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సమ్మేళనాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా బారి నుంచి పిల్లలను వైద్యులు కాపాడగలిగారు. ఇప్పుడు మూడో అల వచ్చినా ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. పిల్లల తల్లిదండ్రులు అనవసర ఆందోళన చెందకండని ధైర్యం నూరిపోశారు. కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదు. ప్రజలు ఇంకొంత కాలం నోటి ముసుగులు ధరించడం, భౌతికదూరం పాటించడం చాలా అవసరమన్నారు. పిల్లల ఆరోగ్య సమస్యలపై చర్చలు జరిపేందుకు హొసపేటెలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనం చాలా ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. సంఘం కర్ణాటక అధ్యక్షుడు డాక్టర్ అశోక్ దాతర్, కార్యదర్శి అమరేశ్వర పాటిల్, కార్యక్రమం సంచాలకులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ మహ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు పీయూష్ గుప్తాను స్థానిక వైద్యులు సన్మానించారు.