logo

జల వివాదాల పరిష్కారానికి కలిసి నడుద్దాం

రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలను పరిష్కరించేందుకు రాజకీయ వైషమ్యాలు మరచి పనిచేద్దామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. తాము విపక్షంలో ఉండగా జల వివాదాల అంశాల్లో అప్పటి అధికార పక్షానికి సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Published : 23 Jan 2022 00:37 IST

రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి పిలుపు

న్యాయనిపుణులతో మరోసారి చర్చిస్తా


సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బొమ్మై, మంత్రులు, అధికారులు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలను పరిష్కరించేందుకు రాజకీయ వైషమ్యాలు మరచి పనిచేద్దామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. తాము విపక్షంలో ఉండగా జల వివాదాల అంశాల్లో అప్పటి అధికార పక్షానికి సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శనివారం దీర్ఘకాలిక జల వివాదాల వ్యవహారాలపై తన అధికార నివాసంలో సమావేశమయ్యారు. కరోనా కారణంగా దిల్లీకి వెళ్లలేని తాను అక్కడి కర్ణాటక తరపు న్యాయవాదులు, అధికారులతో దృశ్యమాధ్యమంలోనే చర్చించారు. కావేరి, కృష్ణా, మహదాయి నదుల పరివాహకంలో మధ్య స్థాయిలో ఉండటం వల్ల దిగువన ఉన్న తమిళనాడు నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. దశాబ్దాలుగా ఈ వివాదాలపై విచారణ కొనసాగుతున్న కారణంగా అన్ని ప్రభుత్వాలు వీటిని పరిష్కరించలేకపోయాయి. పార్టీలన్నీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ వివాదాలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు.

ఫిబ్రవరి రెండో వారంలో అఖిల పక్ష సమావేశం

ఫిబ్రవరి 14న కావేరి జలాల వివాదం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆలోగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బొమ్మై తెలిపారు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు తమ అధికార హయాంలో చేపట్టిన చర్యలు, అభ్యంతరాలు, డీపీఆర్‌ వివరాలపై చర్చించి సహకరించాలన్నారు. కొన్ని వివాదాలు కీలకమైన ఘట్టంలో ఉన్నందున ప్రతిపక్షాలు వాటిపై ఆందోళనల ద్వారా తప్పుదోవ పట్టించే యత్నం చేయరాదని హితవు పలికారు. జనవరి చివరిలో తాను న్యాయ నిపుణులు, ఉభయ సభల నేతలు, జల, న్యాయశాఖల మంత్రులు, అధికారులతో మరో దఫా చర్చిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరో ధర్మాసనానికి కృష్ణా వివాదం

కృష్ణా ఎగువ ప్రాజెక్టుపై రాష్ట్రం తరపున వాదించే న్యాయవాదులు తప్పుకోవటంతో మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని దిల్లీలోని కర్ణాటక న్యాయవాదులు ముఖ్యమంత్రికి సూచించారు. కృష్ణా ప్రాజెక్టుపై వచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ వాదిస్తున్న చంద్రచూడ్‌, ఎ.ఎస్‌.బోపణ్ణలు ఈ నెల 10న తప్పుకోవటంతో విచారణ ప్రక్రియ మందగించే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు. కొత్త ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు మనవి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర వాదనలు సుప్రీంకోర్టుకు వినిపించే దిశగా అన్ని చర్యలు ఇకపై వేగంగా చేపడతామని హామీ ఇచ్చారు.

హొగనేక్కల్‌ ప్రాజెక్టును అడ్డుకుంటాం

కావేరి జల నిర్వహణ ధర్మాసనాలు, సుప్రీంకోర్టుకు కనీస సమాచారం ఇవ్వకుండా తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న హొగనేక్కల్‌ ప్రాజెక్టును అడ్డుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రూ.4,600 కోట్లతో హొగనేక్కల్‌ రెండో దశ, నదుల అనుసంధాన ప్రాజెక్టులకు అనుమతించరాదని తాము కేంద్ర జలశక్తి శాఖకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తానన్నారు. ఇప్పటికే సర్కారు పలు సవాళ్లను ఎదుర్కొంది. ఇకపై న్యాయ, రాజకీయ సంబంధ ఎత్తుగడలతో తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతి రాకుండా చేస్తామని సవాలు విసిరారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర న్యాయవాదులు మోహన్‌ కాతరికి, శ్యాం దివాన్‌, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, కావేరి, కృష్ణ జలభాగ్య మండలి అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని