logo

నరేగా కార్మికుల ఆకస్మిక మృతి

విజయనగర జిల్లాలో రెండు నెలల్లో ఐదుగురు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కార్మికులు పనిచేసే స్థలంలోనే తీవ్ర అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

Published : 30 Jun 2022 00:46 IST

రెండు నెలల్లో ఐదుగురు


మంగళవారం మృతిచెందిన కూడ్లిగి తాలూకా దిబ్బద హళ్లి నరేగా కార్మికుడు సిద్ధప్ప

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లాలో రెండు నెలల్లో ఐదుగురు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కార్మికులు పనిచేసే స్థలంలోనే తీవ్ర అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మృతిచెందిన నరేగా కార్మికులంతా కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. వారి మృతితో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తాజాగా మంగళవారం కూడ్లిగి తాలూకా ఎ.దిబ్బద హళ్లిలో నరేగా కార్మికులు పనిచేస్తూ గుండెనొప్పితో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పటి వరకు హగరిబొమ్మన హళ్లిలో నలుగురు, కూడ్లిగి తాలూకాలో ఒకరు నరేగా కార్మికులు మృతిచెందారు. హగరిబొమ్మన హళ్లిలో మే నెలలో ముగ్గురు కార్మికులు 15 రోజుల్లోనూ మృతిచెందడంతో జిల్లా పంచాయతీ నరేగా కార్మికులకు వైద్యపరీక్షలు చేయించేందుకు ముందుకు వచ్చింది. హగరిబొమ్మన హళ్లిలో ఒక్కసారి మాత్రం వైద్యపరీక్ష శిబిరాలు జరిగాయి. అన్ని తాలూకాల్లోని నరేగా కార్మికులకు వైద్యపరీక్ష శిబిరాలు చేయించాలన్న డిమాండు అలాగే మిగిలిపోయింది. హగరిబొమ్మన హళ్లిలో మొత్తం నలుగురు మృతిచెందగా ఇద్దరి కుటుంబాలకు పరిహారం అందింది. మరో ఇద్దరికి పరిహారం రావాల్సి ఉంది. తాజాగా కూడ్లిగి తాలూకా ఎ.దిబ్బద హళ్లి కార్మికుడు సిద్ధప్ప (62) మృతిచెందారు. ఇప్పటి వరకు మృతిచెందిన ఐదుగురు గుండెపోటుతోనే కన్నుమూశారు. హరిహర, భద్రావతి నుంచి గుండెవ్యాధి నిపుణులను పిలిపించి నరేగా కార్మికులకు పరీక్షలు చేయిస్తామని జడ్పీ అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. జిల్లాలోని పశ్చిమ తాలూకాలైన హగరిబొమ్మన హళ్లి, కూడ్లిగి, కొట్టూరు, హడగలి, హరపన హళ్లిలో చాలా మెట్ట భూములు ఉన్నాయి. వర్షాలు కురిస్తేనే పంటలు. ఈ నేపథ్యంలో ఈ తాలూకాల ప్రజలు కుటుంబ నిర్వహణ కోసం నరేగా పనులకు వెళ్తున్నారు. రోజుకు మహిళ, పురుషులకు సమానంగా రూ.309 కూలి లభించడంతో 60 ఏళ్లు నిండినవారు కూడా పనులకు వెళ్తూ అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో సుమారు 80వేల మంది నరేగా కార్మికులు రోజూ పనిచేస్తున్నారు. మే, జూన్‌ నెలల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండటంతో నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. జూన్‌లో ఎండలు కొంత తగ్గినా కూడ్లిగి తాలూకాలో కార్మికుడు మృతిచెందడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. తప్పనిసరిగా వైద్యపరీక్షలకు ఈ తక్షణమే ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని