logo

వానతాకిడికి తల్లడిల్లిన జనం

రాష్ట్ర వ్యాప్తంగా వాన హోరు కారణంగా ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌.. నాలుగు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఉద్యాననగరిలో ఎల్లో అలర్ట్‌ శనివారం వరకు కొనసాగనుంది

Published : 06 Aug 2022 02:06 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా వాన హోరు కారణంగా ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌.. నాలుగు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఉద్యాననగరిలో ఎల్లో అలర్ట్‌ శనివారం వరకు కొనసాగనుంది. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాదగిరి జిల్లాలోని ప్రముఖ దబదబె జలపాతం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. చుట్టుపక్కల రహదారులు నదిలా మారిపోయాయి. కాకలవార క్రాస్‌ నుంచి బస్టాండ్‌ వరకు వెళ్లే మార్గంలో నడుము లోతు నీరు నిలిచింది. శహాపుర పట్టణం నుంచి చుట్టుపక్కల 20 గ్రామాలకు సంచారం నిలిచి పోయింది. బాగలకోటె జిల్లా బాదామి తాలూకా యంకంచి, మణినాగర వంతెనలపై నుంచి వరద నీరు ప్రవాహం కొనసాగింది. చాళుక్యుల సమయంలో నిర్మించిన అగస్త్య తీర్థం కల్యాణి పూర్తిగా నిండిపోయింది. భూతనాథ దేవాలయం వెనుక ఉన్న అక్కతంగియర జలపాతం హోరెత్తుతోంది. బాదామి- కెరూరు మధ్య సంచారం పూర్తిగా నిలిచిపోయింది. బాదామి సమీపంలోని గోవకొప్ప, కుళగేరి గ్రామాలు ద్వీపాల్లా మారిపోయాయి. చిమ్మనకట్టి గ్రామంలోని పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లోనూ మోకాలి లోతున నీరు నిలిచింది.
* చామరాజనగరలో వర్షంతో జనం గగ్గోలు పెడుతన్నాఉ. జిల్లా పాలన భవంతి ద్వీపమైంది. కార్యాలయాల్లో నాలుగు అడుగుల నీరు నిలిచింది. ఇళ్ల ముందు నిలిపిన బైకులు నీటిలో మునిగిపోయాయి. మార్కెట్లలోనూ అదే పరిస్థితి కొనసాగడంతో పండుగకు వ్యాపారం చేసుకోలేకపోయామని వ్యాపారులు ఆక్రోశించారు. చిక్కహొళె, సువర్ణావతి జలాశయాలు నిండడంతో ఔట్ఫ్లోను పెంచారు. హనూరు తాలూకాలో కోరమన కత్రి వంతెనపై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుండడంతో తమిళనాడులోని సత్యమంగళానికి రాకపోకలు నిలిచిపోయాయి. మలెమహదేశ్వర బెట్టపై ఉన్న మజ్జనబావి నీటిలో మునిగిపోయింది. ఈ బావి నీటితోనే మాదప్పకు అర్చకులు నిత్యం అభిషేకం చేస్తారు. కొళ్లేగాల తాలూకా దాసనపుర వంతెన వద్ద శాంతరాజు (28) అనే యువకుడు కావేరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై తన బైకు, చరవాణి వదిలి నీటిలోకి దూకాడు. ఆత్మహత్యకు దూకాడా? ఈత కొట్టేందుకు నదిలోకి దుమికాడా? అనేది తేలలేదని కొళ్లేగాల పోలీసులు తెలిపారు. చామరాజనగరకు చేరువలోని సంతేమారహళ్లిలో ఓ భారీ వృక్షం కారుపై కూలింది. అందులోని ఇద్దరు విగతజీవులుగా మారినట్లు సమాచారం.
* కలబురగి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగలో భారీ వర్షంతో ఒక కళాశాల పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు గాయపడ్డారు. వీరిలో నిఖిత అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
* కోలారు జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లిన నౌషాద్‌ అనే యువకుడి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో జారిపడ్డాడని గుర్తించారు. మణిఘట్ట రహదారి రాజకాలువలో ఇతని మృతదేహం లభించింది. మండ్య జిల్లాలో వర్షం కొనసాగింది. నాగమంగల తాలూకా అణెచెన్నాపుర గ్రామంలో వంతెన జలావృతమైంది. వరద ప్రవాహానికి వంతెనపై వెళుతున్న గూడ్సు ఆటో కొట్టుకుపోయింది. వాహనాన్ని నిలపలేకపోయిన డ్రైవరు, త్రుటిలో కిందకు దిగి ప్రాణాలను కాపాడుకున్నాడు. వంతెనపై నుంచి వాహనాలు వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. పొగాకు, అల్లం పంటల్లోకి నీరు చేరుకుంది.
ః విజయపుర జిల్లా తికోటా తాలూకాలో కురిసిన వర్షంతో తుబచి బబలేశ్వర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కాలువల్లో ప్రవాహం తీవ్రమైంది. కళ్లవటగి గ్రామం సమీపంలో సంగమనాథ కాలువలోని నీరు పక్కనే ఉన్న ఆలయంలోకి వచ్చింది. విజయపుర- బెళగావి మార్గంలో డోణి నది ప్రవాహం అదుపుతప్పింది. మొసళ్లు, పాములు చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఇక్కడి పౌర జీవితానికి ఆటంకం కలిగింది. కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, శివమొగ్గ జిల్లాలలోని పలు తాలూకాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది.
దావణగెరె జిల్లాలో వర్షం తీవ్రతకు చెన్నగిరి, హొన్నాళి, న్యామతి తాలూకాల్లో పంటలు, తోటలు నీట మునిగాయి. ఆరుండి, కంచికొప్ప, జీనళ్లి, గుడ్డేహళ్లి, మల్లిగేనహళ్లి, బెళగుత్తి గ్రామాల్లోని ఇళ్లను వరద ముంచెత్తింది. జిల్లాధికారి శివానంద కాపశి పలు ప్రాంతాల్లో సంచరించి, పంట నష్టాలను అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకు ఈ తాలూకాల్లో సగటున 60 మి.మీ. పైచిలుకు వర్షపాతం నమోదైంది. జిల్లాలో రూ.116.35 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
గాలి వానకు చామరాజనగర సమీప సంతేమారహళ్లిలో కారుపై భారీ వృక్షం కూలింది.. ఈ ఘటనలోనే ఇద్దరు విషాదాంతమయ్యారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని