logo

ఆ ముగ్గురు ఇంటికి.. ఆయన అసెంబ్లీకి

విధానసభ ఎన్నికల్లో బళ్లారి జిల్లాలోని ఐదు విధానసభ క్షేత్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గత విధానసభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ, కంప్లి, సండూరు క్షేత్రాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా..బళ్లారి నగరం, సిరుగుప్పల్లో భాజపా అభ్యర్థులు గెలుపొందారు.

Updated : 15 May 2023 05:15 IST

మామ- మేనల్లుడు, బావ- మరదలు ఓటమి
నాలుగు సార్లు గెలుపొందిన ఇ.తుకారామ్‌, బి.నాగేంద్ర

బళ్లారి, న్యూస్‌టుడే: విధానసభ ఎన్నికల్లో బళ్లారి జిల్లాలోని ఐదు విధానసభ క్షేత్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గత విధానసభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ, కంప్లి, సండూరు క్షేత్రాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా..బళ్లారి నగరం, సిరుగుప్పల్లో భాజపా అభ్యర్థులు గెలుపొందారు..ఈసారి కాషాయదళం ఖాతా తెరవ లేకపోయింది. గెలిచిన ఐదుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యం సాధించడం విశేషం.

ఇద్దరినీ ఓడించారు: బళ్లారి గ్రామీణ క్షేత్రంలో భాజపా తరఫున మాజీ మంత్రి బి.శ్రీరాములు, కంప్లిలో అదే పార్టీ తరఫున పోటీ చేసిన టి.హెచ్‌.సురేశ్‌బాబు ఓటమి పాలయ్యారు. టి.హెచ్‌.సురేశ్‌బాబు శ్రీరాములుకు వరసకు మేనల్లుడు. శ్రీరాములు 1999లో బళ్లారి నగరం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. 2004 నుంచి అదే స్థానం నుంచి విజయం సాధించారు. 2008లో బళ్లారి గ్రామీణ క్షేత్రం నుంచి గెలుపొందారు. 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2011లోనే స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలుపొందారు. 2013లో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం నుంచి గెలుపొందారు. 2014లో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని భాజపాలోకి విలీనం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 2018లో మరో సారి చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు నుంచి గెలుపొందారు. ఐదు సార్లు శాసనసభ్యుడిగా, ఓ సారి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. ఈసారి బళ్లారి గ్రామీణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బి.నాగేంద్ర చేతిలో 29,300 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈయన మేనల్లుడు టి.హెచ్‌.సురేశ్‌బాబు 2008 ఎన్నికల్లో కంప్లి నుంచి భాజపా తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. రాష్ట్రంలోనే అతి చిన్న వయస్సులో శాసనసభ్యుడిగా గెలుపొంది రికార్డు సృష్టించారు. 2013లో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018, 2023 ఎన్నికల్లో వరుసగా జె.ఎస్‌.గణేశ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

బావ-మరదళ్లకు రిక్తహస్తం: బళ్లారి నగర క్షేత్రం జనరల్‌కు రిజర్వు కావడంతో భాజపా నుంచి గాలి సోమశేఖర్‌రెడ్డి, కె.ఆర్‌.పి.పి నుంచి లక్ష్మీ అరుణలు పోటీ చేశారు. వరసకు ఇద్దరూ బావ, మరదళ్లు. గాలి సోమశేఖర్‌రెడ్డి 2008, 2018 విధానసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2013 విధానసభ ఎన్నికల్లో సోదరుడు గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ గనుల కేసులు ఆరోపణలపై జైలుకు వెళ్లడంతో పోటీ నుంచి దూరంగా ఉండిపోయారు. 2023 విధానసభ ఎన్నికల ముందు గాలి జనార్దన్‌రెడ్డి కేఆర్‌పీపీని స్థాపించి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. సోమశేఖర్‌రెడ్డి భాజపా జాతీయ పార్టీలోనే ఉండి పోయారు. ఈనేపథ్యంలో గాలి జనార్దన్‌రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణను పోటీలోకి దింపారు. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పాటు లక్ష్మీ అరుణ భాజపా ఓట్లను చీల్చడంతో ఇద్దరూ ఓటమి పాలయ్యారు.

నాగేంద్ర, తుకారామ్‌లకు నాలుగు సార్లు పట్టం: బళ్లారి గ్రామీణ క్షేత్రం నుంచి పోటీ చేసిన బి.నాగేంద్ర వరుసగా నాలుగో సారి గెలుపొందారు. సండూరు నుంచి పోటీ చేసిన ఇ.తుకారామ్‌ నాలుగో సారి గెలుపొంది రికార్డు సృష్టించారు. నాగేంద్ర 2008లో కూడ్లిగి నుంచి భాజపా అభ్యర్థిగా గెలిచారు. 2013లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2018లో బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2023లో ఇదే క్షేత్రం నుంచి మంత్రి బి.శ్రీరాములుపై 29,300 ఆధిక్యతతో గెలుపొందారు. ఇ.తుకారామ్‌ 2008లో సండూరు నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 2013, 2018లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 2023 విధానసభ ఎన్నికల్లోనూ విజేతగా రికార్డు సృష్టించారు.

పాపం కలిసిరాలేదు:  రెడ్డి సోదరులుగా పేరు పొందిన గాలి కరుణాకరరెడ్డి, గాలి సోమశేఖర్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డితో పాటు, బి.శ్రీరాములు కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2008, 2018 విధానసభ ఎన్నికల్లో గాలి కరుణాకర్‌రెడ్డి, గాలి సోమశేఖర్‌రెడ్డి, బి.శ్రీరాములు విధానసభలో అడుగుపెట్టారు. గాలి జనార్దన్‌రెడ్డి మాత్రం గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలతో కోర్టు చుట్టూ తిరిగారు. భాజపాతో పాటు గాలి కరుణాకర్‌రెడ్డి గాలి సోమశేఖర్‌రెడ్డి, బి.శ్రీరాములు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలతో భాజపాతో తెగతెంపులు చేసుకుని కేఆర్‌పీపీని స్థాపించిన గాలి జనార్దన్‌రెడ్డి గంగావతి విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేసి గెలిచారు. మిగిలిన ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓటమిపాలై ఇంటికి పరిమితమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని