logo

ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా

బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్‌ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు.

Published : 29 Mar 2024 03:13 IST

నిప్పులు చెరిగిన సిద్ధరామయ్య

సభా వేదికపై ప్రసంగిస్తున్న సిద్ధరామయ్య

రామనగర, న్యూస్‌టుడే : బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్‌ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. వైట్కాలర్‌ అభ్యర్థి డాక్టర్‌ మంజునాథ్‌ కావాలో- సురేశ్‌ కావాలో ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. రామనగరలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచి సురేశ్‌ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరోసారి ఆయనకే పార్టీ టికెట్‌ కేటాయించిందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ముందంజలో ఉంటే.. కమలనాథులు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతారని ఆరోపించారు. ఐదు గ్యారంటీ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యిందన్నారు. భాజపాకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. కర్ణాటకలో భాజపా అధికారంలో ఉన్నప్పుడు పన్నుల రూపంలో చెల్లించిన మొతాన్ని అభివృద్ధి పనులకు ఉపయోగించలేదన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామనగర అభివృద్ధిని పక్కన పెట్టారని ఆరోపించారు.

భాజపా, దళ్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను విశ్వసించేందుకు ప్రజలు పిచ్చివాళ్లు కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. కావేరి నీటిని కాపాడుకునేందుకు, మేకెదాటు ప్రాజెక్టుకు చేసిన పోరాటానికి జనతాదళ్‌ మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు భాజపాతో చేరి, కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడమే లక్ష్యంగా దళపతులు పని చేస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ అభ్యర్థి డీకే సురేశ్‌, మంత్రులు ఎంసీ సుధాకర్‌, మంకాళ వైద్య, ఎమ్మెల్సీ సుదామ దాస్‌, జాతీయ యువ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని