logo

గత వైభవమా.. వరుస విజయమా!

కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. గడిచిన మూడు ఎన్నికల్లో భాజపా బాట పట్టింది. 2004 తరువాత కాంగ్రెస్‌కు కొరకురానికొయ్యలా తయారైంది.

Published : 13 Apr 2024 04:53 IST

నాడు కాంగ్రెస్‌ కంచుకోట..నేడు భాజపాకు బాసట
కొప్పళలో ఎవరిదో పైచేయి?

గంగావతి,న్యూస్‌టుడే: కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. గడిచిన మూడు ఎన్నికల్లో భాజపా బాట పట్టింది. 2004 తరువాత కాంగ్రెస్‌కు కొరకురానికొయ్యలా తయారైంది. 2009, 2014, 2019లో భాజపా హ్యాట్రిక్‌ కొట్టింది. నాలుగోసారి సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. గత వైభవాన్ని తిరిగి పొందాలని కాంగ్రెస్‌ పోరాడుతోంది. భాజపా సిట్టింగ్‌ ఎంపీ సంగణ్ణను కాదని కొత్తముఖం యువ వైద్యుడు కె.బసవరాజ్‌ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఓడిన రాజశేఖర్‌ హిట్నాళకు కాంగ్రెస్‌ మరో అవకాశం ఇచ్చింది. మూడు ఎన్నికల్లో భాజపా వీరశైవ పంచమసాలి వర్గం అభ్యర్థులనే ఎంపిక చేసి సఫలమైంది. ప్రస్తుతం అదే సంప్రదాయం కొనసాగించింది. కాంగ్రెస్‌ వెనుకబడ్డ వర్గాల వైపే మొగ్గు చూపింది.

కొప్పళ బసవేశ్వర కూడలి

మూడు జిల్లాల నియోజకవర్గం: 2004 నియోజవర్గాల పునర్విభజన ప్రకారం ఈ లోక్‌సభ స్థానం కొప్పళ, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో విస్తరించింది. కొప్పళ, యలబుర్గా, కనకగిరి, కుష్ఠగి, గంగావతి, సింధనూరు. మస్కి, సిరుగుప్ప శాసనసభ నియోజకవర్గాలు ఈ స్థానం పరిధిలోకి వస్తాయి. మొత్తం 18,51,700 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలే అధికం. పురషులు 912818 మంది, మహిళలు 939750 మంది, ఇతరులు 132 మంది ఉన్నారు. 2,045 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

విశేషాలు: 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపగా కొప్పళ ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి శివమూర్తిస్వామి అళవండిని గెలిపించారు. 1991లో జనతా పరివార్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇక్కడ బరిలోకి దించింది. ఆయన ఓటమి చవిచూశారు. అప్పట్లో లోక్‌సభకు ఎన్నికై ఉంటే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడిని కాదంటూ సిద్ధరామయ్య కొప్పళకు వచ్చిన ప్రతిసారి చమత్కరిస్తుంటారు. 1989లో ఇక్కడి నుంచి గెలిచిన బసవరాజ్‌ పాటిల్‌ అన్వరీ చంద్రశేఖర్‌ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రిగా సేవలు అందించారు. అప్పట్లో దక్షిణ భారతం నుంచి కేంద్ర మంత్రి మండలిలో ఆయనొక్కరికే స్థానం దక్కడం విశేషం.

బలాబలాలు

కొప్పళ లోక్‌సభ పరిధిలోని 8 శాసనసభ నియోజకవర్గాల్లో గత శాసనసభ ఎన్నికల్లో ఆరుచోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. యలబుర్గా, కొప్పళ, కనకగిరి, సింధనూరు, మస్కి, సిరుగుప్పాల్లో కాంగ్రెస్‌ శాసనసభ్యులున్నారు. కుష్ఠగిలో భాజపా నెగ్గింది. గంగావతిలో కేఆర్‌పీపీ నుంచి శాసనసభకు ఎన్నికైన గాలి జనార్దన్‌రెడ్డి ఇటీవల భాజపాలో చేరడం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎవరి ప్రభావం ఎంత అనేది ఓటర్లే తేల్చాలి. సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు, కార్యకర్తల బలగం ఎక్కువే. భాజపా మాత్రం తన పూర్వ వైభవం పైనే ఆధారపడింది. తాజా కేఆర్‌పీపీ విలీనంతో ఎంతమేరకు సఫలీకృతమవుతుందో వేచిచూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని