logo

ప్రగతి సుద్దులు మరచిన పెద్దలు

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైనప్పటి నుంచి ఏలికలు ఎంతమంది వచ్చినా ప్రగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

Published : 16 Apr 2024 01:05 IST

గనినాడులో కన్పించని అభివృద్ధి
సోనియాగాంధీనే కాస్త నయం

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైనప్పటి నుంచి ఏలికలు ఎంతమంది వచ్చినా ప్రగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఆధునిక సాంకేతికతతో అన్ని రంగాల్లో ప్రపంచం దూసుకెళ్తుంటే గనినాడులో మాత్రం బద్ధలైన రహదారులు.. ఇరుకుగా మారిన వీధులు.. విస్తరించని మౌలిక వసతులు.. గిట్టుబాటు కాని సేద్యం, అందుబాటులోకి రాని ఆధునిక వైద్యం.. తాండవించే నిరుద్యోగం.. పీడించే కరవు ఛాయలు.. వెరసి గనినాడు ప్రగతి తిరోగమన దారి పట్టింది. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధిపై ప్రత్యేక కథనం.

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లోక్‌సభ స్థానానికి 2019 వరకు మొత్తం 17 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు..2000లో సోనియాగాంధీ రాజీనామా చేసిన సందర్భంలో కోళూరు బసవనగౌడ, 2018లో ఎంపీగా ఉన్న బి.శ్రీరాములు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో వి.ఎస్‌.ఉగ్రప్ప గెలుపొందారు. 1952 నుంచి 1999 వరకు కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌సభ సభ్యులుగా నేతలు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2019 వరకు భాజపా నేతలు లోక్‌సభకు ఎన్నికాగా, 2018లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో వి.ఎస్‌.ఉగ్రప్ప ఎన్నికై పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. ఈ 74 సంవత్సరాల్లో 19సార్లు లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలలో ఇద్దరికి మాత్రమే కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించింది. వారిలో తమిళనాడు (మద్రాస్‌)కు చెందిన వి.కె.ఆర్‌.వి.రావ్‌ బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రి వర్గంలో ఉపరితల, ఓడరేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1996 వరకు బళ్లారికి చెందిన బసవరాజేశ్వరి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. మిగిలిన వారిలో స్వాతంత్య్ర సమరయోధుడు, బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1952 నుంచి 1962 వరకు మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన టేకూరు సుబ్రహ్మణ్యం మాత్రం ప్రధాని నెహ్రూ రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు.

బళ్లారికి చేసింది శూన్యం

బళ్లారి లోక్‌సభ స్థానానికి మొత్తం 19 సార్లు ఎన్నికలు జరగగా 19 మందిని ఎంపీలను పార్లమెంట్‌కు పంపినా వారు బళ్లారికి చేసింది అంతంతేనని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. 1957లో టేకూరు సుబ్రహ్మణ్యం లోక్‌సభలోకి ప్రవేశించారు. అప్పట్లో బళ్లారిలో ప్రకృతి సంపదకు నిలయం..స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయేది. నదుల అనుసంధానం, రైల్వే లైన్లను మీటర్‌ గేజ్‌ నుంచి బ్రాడ్‌ గేజ్‌గా మార్చమని కోరినా అప్పట్లో సాధ్యం కాలేదు. 1962 తర్వాత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటానని టేకూరు సుబ్రహ్మణ్యం స్వచ్ఛందంగా ప్రకటించారు.కేంద్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తమిళనాడుకు చెందిన వి.కె.ఆర్‌.వి.రావ్‌ (విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజ రావ్‌) లోక్‌సభ నియోజకవర్గం లేకపోవడంతో ఎక్కడ నుంచి పోటీ చేయాలోనని ప్రయత్నాలు చేస్తున్న తరణంలో పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో 1967లో బళ్లారి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1971లో వరసగా రెండో సారి కూడా గెలుపొందారు. ఆయన 1967 నుంచి 71 వరకు కేంద్ర మంత్రి వర్గంలో ఉపరితల శాఖ, ఓడరేవుల (షిప్పింగ్‌) మంత్రిగా పనిచేశారు. వి.కె.ఆర్‌.వి.రావ్‌ కేంద్రంలో ప్రముఖ పాత్ర పోసించినా బళ్లారికి చేసింది అంతంతే. ఓ నౌకకు బళ్లారి అని నామకరణం చేశారు. బసవరాజేశ్వరి 1984, 1989, 1991లో వరసగా మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో బసవరాజేశ్వరి కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్నా గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి చేయలేదని జిల్లావాసులు చెబుతున్నారు. 1996, 1998లో రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన కె.సి.కొండయ్యకు కూడా అదే దారిలో ముందుకు వెళ్లారు. 1999లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ బళ్లారిలో గెలుపొంది, అనంతరం రాజీనామా చేశారు. బళ్లారి జిల్లా ప్రజలకు గుర్తుగా రూ.3,500 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేయించారు. అదే సందర్భంగా బళ్లారి జిల్లా కుడతిని వద్ద రూ.2,500 కోట్లుతో కుడతిని థర్మల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. బళ్లారి జిల్లాలో ఆసుపత్రులు, పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 నుంచి మొదటి సారిగా బళ్లారి లోక్‌సభ సభ్యుడిగా గాలి కరుణాకర్‌రెడ్డి, 2009లో భాజపా నుంచి జె.శాంత గెలుపొందారు. హంపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు మొదటి ఫ్లాట్‌ఫాంకు వచ్చే విధంగా జె.శాంత కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చారు. 2014లో భాజపా నుంచి బి.శ్రీరాములు, 2019లో వై.దేవేంద్రప్ప గెలుపొందినా బళ్లారికి ప్రత్యేక గుర్తింపు పొందే ఎలాంటి పనులు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని