logo

పంచభూతాల్లో లీనమైన ద్వారకీశ్‌

గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్‌ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్‌ మిల్‌ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Published : 18 Apr 2024 02:50 IST

కడసారి నివాళి అర్పిస్తున్న సిద్ధరామయ్య

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్‌ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్‌ మిల్‌ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితికి పెద్ద కుమారుడు యోగేశ్‌ నిప్పంటించారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని గుళిమంగలలోని నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. రవీంద్ర కళాక్షేత్రకు బుధవారం ఉదయం 7.30కి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, నటులు శివరాజ్‌ కుమార్‌, యశ్‌, జగ్గేశ్‌, రవిచంద్రన్‌, ధ్రువ్‌ సర్జా, సుమలత అంబరీశ్‌, రాఘవేంద్ర రాజ్‌ కుమార్‌, దేవరాజ్‌, శ్రీమురళి, అనిరుద్ధ, చరణ్‌ రాజ్‌, సుధారాణి, శ్రుతితో పాటు చిత్రపరిశ్రమకు చెందిన భామా హరీశ్‌, ఉమేశ్‌ బణకార్‌, కుమార్‌ బంగారప్ప, నాగేంద్ర ప్రసాద్‌, మునిరత్న, కె.మంజు, రాక్‌లైన్‌ వెంకటేశ్‌, మంజుళా గురురాజ్‌ తదితరులు ద్వారకీశ్‌కు అంతిమ నివాళి అర్పించారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలుగు విజ్ఞాన సమితి, అంజతా మూవీస్‌తో ద్వారకీశ్‌కు ఉన్న అనుబంధాన్ని సమితి అధ్యక్షుడు రాధాకృష్ణరాజు గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలో ద్వారకీశ్‌ అపురూపమైన నటుడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాళులర్పించారు. హాస్యనటునిగానే కాకుండా కథానాయకునిగా, నిర్మాతగా, దర్శకునిగా ఆయన సేవలు అమరమని కొనియాడారు. మొదటి భార్య అంబుజ మరణించిన మూడేళ్లకే ఆయన కన్నుమూయడం కాకతాళీయమన్నారు. తనను ద్వారకీశ్‌ ఎప్పుడూ మోసం చేయలేదని ఆయన రెండో భార్య శైలజ తెలిపారు. ద్వారకీశ్‌, అంబుజ, తాను ఒకే ఇంట్లో ఉండేవారిమని, ఎప్పుడూ తమ మధ్య పొరపొచ్చాలు రాలేదన్నారు. ఐదుగురు కుమారులు, కోడళ్లు, మనవళ్లు అంతా తమతో ప్రేమగా వ్యవహరించేవారని గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియల వేళ భద్రత కోసం ప్రభుత్వం 200 మంది పోలీసులను నియమించింది.

చిత్రదుర్గం : ద్వారకీశ్‌ (81) మృతికి చిత్రదుర్గ పట్టణ వాసులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భార్య అంబుజాక్షి చిత్రదుర్గ నివాసి. ఆయనకు దుర్గంతో ఎంతో అనుబంధం ఉండేదని నగరసభ మాజీ అధ్యక్షుడు సర్దార్‌ పాషా గుర్తుచేసుకున్నారు. ఆమె మూడేళ్ల కిందటే ఏప్రిల్‌ 16న మరణించడం ప్రస్తావనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని