logo

వామ్మో వైరల్‌ జ్వరాలు

వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 వరకు చలి తీవ్రత కొనసాగుతోంది.

Published : 29 Jan 2023 03:08 IST

జలుబు, దగ్గుతో సతమతం
వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యులు
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చల్లని వాతావరణానికి పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఇటీవల పెరిగిన రోగుల సంఖ్య కూడా పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు పిల్లలు ఆయా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రస్తుత తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో చల్లని వాతావరణానికి ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరాలు, తలనొప్పి, గొంతునొప్పి బారిన పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న బాధితులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ చలిగాలిలో ప్రయాణించడం, ఉదయాన్నే నిద్రలేచి విద్యార్థులు చల్లని వాతావరణంలో ప్రత్యేక తరగతులకు హాజరు కావడం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. చలి తీవ్రతను, కాలుష్యాన్ని దరిచేరకుండా మాస్క్‌లు, వెచ్చని దుస్తులు ధరించకపోవడం కూడా సమస్యలకు కారణమవుతోంది.

* కొద్దిరోజుల నుంచి జిల్లా ఆస్పత్రి ఓపీ విభాగానికి వచ్చే రోగుల సంఖ్య సాధారణ రోజుల కన్నా 10 నుంచి 20 శాతం వరకు పెరిగింది. అందులో 70 శాతం మంది జలుబు, జ్వరం బాధితులే. చలి పెరిగిన తర్వాతే పలు సమస్యలతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. చికిత్స తీసుకుంటున్నా ఆయా సమస్యలతో కనీసం వారంపాటు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలు, వసతి గృహాల్లో నివాసముంటున్న విద్యార్థులు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. ఫలితంగా 10 శాతం మంది గైర్హాజరవుతున్నారని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు.

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: డాక్టర్‌ శిల్ప, పిల్లల వైద్య నిపుణురాలు

చలికాలం తగ్గే వరకు తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆస్తమా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యం కుదుటపడే వరకు ఇంటికే పరిమితం కావాలి. సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు పంపించవద్దు. పాఠశాలలకు వెళ్లే సమయంలో మాస్క్‌లు, వెచ్చదనాన్ని అందించే దుస్తులు వేయాలి. వీలైనంత వరకు చలిగాలులకు దూరంగా ఉంచాలి.

వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల విస్తృతి: డాక్టర్‌ సురేందర్‌, ప్రభుత్వాసుపత్రి వైద్యులు

చలి గాలులే అనారోగ్య సమస్యలకు కారణం. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జ్వరం సమస్యలతో బాధపడుతున్న వారే ఆస్పత్రులకు అధికంగా వస్తున్నారు. బాధితులు కనీసం రెండు వారాల పాటు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కొవిడ్‌ కాకపోయినా ప్రస్తుత సీజన్‌లో వచ్చే సమస్యలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. మాస్క్‌ ధరించడం, శుభ్రత పాటించడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు, ఆహారం తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని