logo

సర్కారు వైద్యం.. రోగులకు ఉపయుక్తం

వైద్యరంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఉభయ జిల్లాల్లో గతేడాది సత్ఫలితాలను ఇచ్చాయి.

Updated : 02 Feb 2023 05:10 IST

ఖమ్మం వైద్య విభాగం, న్యూస్‌టుడే

కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సిటి స్కాన్‌

వైద్యరంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఉభయ జిల్లాల్లో గతేడాది సత్ఫలితాలను ఇచ్చాయి. ఆరోగ్యశ్రీ, డయాలిసిస్‌, అధునాతన పరికరాలు, టీ హబ్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న 79 మంది వైద్యుల సర్వీసును సర్కారు క్రమబద్ధీకరించింది. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో సిటిస్కాన్‌ సేవలను త్వరలో ప్రారంభించనుంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథలాబ్‌ సేవలు మొదలయ్యాయి. రెండు టిఫా పరికరాలతో గర్భిణులకు స్కానింగ్‌ పరీక్షలు విస్తృతపరిచింది. అత్యాధునిక పరికరాలతో గుండె సంబంధిత వైద్యసేవలు ఆరంభమయ్యాయి. 700 మంది వరకు గుండె సంబంధిత చికిత్సలు పొందారు.

వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులకు మహర్దశ

వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అశ్వారావుపేటలో రూ.90లక్షలు, మణుగూరులో రూ.1.06 కోట్లు, బూర్గంపాడులో రూ.3 కోట్లు, ఇల్లెందులో రూ.80 లక్షలతో ప్రభుత్వాసుపత్రులు, పాల్వంచలో రూ.26లక్షలతో సామాజిక ఆరోగ్య కేంద్రం, భద్రాచలంలో రూ.1.40కోట్లతో ఏరియా ఆసుపత్రిని విస్తరించనుంది. చర్ల ఆసుపత్రిలో రూ.1.40కోట్లతో మెటర్నిటీ వార్డు నిర్మాణం పురోగతిలో ఉంది. ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఏజెన్సీలో రక్తహీనత, తలసీమియా, సికిల్‌సెల్‌ అనిమియా బాధితులకు రక్తం ఎక్కించడానికి బ్లడ్‌బ్యాంక్‌ స్టోరేజ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

పెరిగిన సాధారణ ప్రసవాలు

గతేడాది మాతా, శిశు మరణాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణుల్లో రక్తహీనత సమస్యను అధిగమించడానికి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మిడ్‌వైఫరీ విధానాన్ని విస్తృతపరిచి ప్రత్యేక శిబిరాలు నిర్వహించింది. సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచేందుకు గర్భిణులతో వ్యాయామం చేయించే క్రతువును ఆరంభించింది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,098 (49 శాతం), భద్రాద్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 6,204 (59 శాతం) నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే సీ సెక్షన్‌ ప్రసవాల సంఖ్య తగ్గింది.

డయాలసిస్‌ సేవల విస్తృతికి సన్నాహాలు

ఉభయ జిల్లాల్లో డయాలసిస్‌ సేవలను విస్తరించేందుకు అంకురార్పణ జరిగింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాసుపత్రులు, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోగుల సౌకర్యార్థం నెల రోజుల్లో అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందులో డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. 2022లో ఉభయ జిల్లాల్లో 10,102 మంది డయాలసిస్‌ సేవలు పొందారు.

ఆరోగ్యశ్రీ చికిత్సలతో ఊరట

ఆరోగ్యశ్రీ చికిత్సలు పేదలకు ఊరటనిస్తున్నాయి. వివిధ రకాల సమస్యలతో ఉభయ జిల్లాల్లో 17,678 మంది  ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందారు. ఖమ్మం టీ హబ్‌లో 82,860 మంది నుంచి 1,69,044 నమూనాలు సేకరించారు. భద్రాద్రి జిల్లా టీ హబ్‌లో 1,30,436 మంది నుంచి నమూనాలు సేకరించి 2,28,814 పరీక్షలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని