logo

కొంత మోదం... కొంత ఖేదం

కేంద్ర బడ్జెట్‌ వల్ల వ్యాపార వర్గాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు. వ్యవసాయం దెబ్బతింటే దాని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీని వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనం లేదు.

Updated : 02 Feb 2023 06:50 IST

కేంద్ర బడ్జెట్‌పై వ్యాపార, ఉద్యోగ వర్గాల అభిప్రాయం


కేంద్ర బడ్జెట్‌ వల్ల వ్యాపార వర్గాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు. వ్యవసాయం దెబ్బతింటే దాని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీని వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనం లేదు.
చిన్ని కృష్ణారావు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు, ఖమ్మం


మధ్య తరగతి ప్రజలకు ఇది ఊరటనిచ్చే బడ్జెట్‌. కొంత వరకు బాగానే ఉంది. వ్యాపార రంగానికి కొంత అనుకూలంగానే ఉంది. రక్షణ రంగానికి అధికంగా నిధులు కేటాయించటం సంతోషకరం. మనకున్న ఆయుధ సంపత్తిని చూసి పాకిస్థాన్‌, చైనా భయపడుతున్నాయి. ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఖమ్మం వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు


త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది చూసిన తర్వాత నిరాశకు గురయ్యారు. ప్రధానంగా వ్యాపారవర్గాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. పరిశ్రమలకు, వ్యవసాయరంగానికి ఎక్కువగా నిధులు కేటాయించలేదు.  
కొప్పు నరేశ్‌కుమార్‌, ఖమ్మం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు


కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ వేతన జీవులకు కొంత ఊరట కలిగించినట్లు కన్పిస్తోంది. వ్యవసాయ రంగాన్ని, మధ్య తరగతి పరిశ్రమలను పూర్తిగా విస్మరించింది. కార్పొరేట్‌ రంగానికి పెద్ద పీట వేసినట్లుంది. దేశంలో వృద్ధి రేటు గణనీయంగా ఉన్నా ఆ ఫలాలను ఉపాధి కల్పనకు పెంపొందించలేకపోతున్నారు.
 ఎన్‌.వెంకన్న, సహాయ ఆచార్యుడు, ఎకనమిక్స్‌, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల


కేంద్ర బడ్జెట్‌ ప్రధానాంశాల్లో ప్రకృతి వ్యవసాయంలో ఆలోచనా విధానం అభినందించాల్సిన విషయం. ఆర్థిక వ్యవస్థ పునాదిలో వ్యవసాయం ప్రధానమైన, మేకింగ్‌ వర్క్‌షాప్‌ విధానం అమలు చేయటం చాలా ప్రధానం. సంక్షేమ కేటాయింపుల్లో అసమానతలు రాష్ట్రాల మధ్య జరగకుండా చూడాలి. ఒక విధంగా ఇది మెరుగైన బడ్జెట్టే.  
డాక్టర్‌ ఎన్‌.గోపి, సహాయ ఆచార్యుడు, ఎకనమిక్స్‌


‘‘కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేలా కేంద్రం బడ్జెట్‌ ఇది. మంత్రి నిర్మల బడ్జెట్లో తెలంగాణకు ప్రయోజనం లేకుండా పోయింది. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూ.5,300 కోట్లు కేటాయించారు. తెలంగాణలో భాజపాకు నలుగురు ఎంపీలున్నా మొండి చేయి చూపారు. పునర్విభజన హామీలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు.’’
 తాతా మధు, ఎమ్మెల్సీ, భారాస జిల్లా అధ్యక్షుడు


‘‘కేంద్ర బడ్జెట్‌ తెలంగాణ ప్రజలను నిరాశపరిచింది. సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులను ఛిద్రం చేసేలా ఉంది. పునర్విభజన చట్టంలో అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. నిరుద్యోగం, గిట్టుబాటు ధర పట్టించుకోలేదు. కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టే యత్నం చేశారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఊసెత్తలేదు.
పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, డీసీసీ అధ్యక్షుడు


‘‘కేంద్ర బడ్జెట్‌ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంది. వ్యవసాయానికి రూ.20 లక్షల కోట్లు రుణాల రూపంలో మంజూరు చేశారు. ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ.7 లక్షలకు పెంచారు. ఫార్మా అభివృద్ధి, మేకిన్‌ ఇండియా, మేక్‌ ఏ వర్క్‌ మిషన్‌ ప్రారంభం, సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకం, మహిళలు, దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రానున్నాయి.’’
గల్లా సత్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షుడు



‘‘కేంద్ర బడ్జెట్‌లో విద్యా, వైద్య రంగాలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను రూపొందించారు. అల్పాదాయ వర్గాలను పూర్తిగా విస్మరించారు. ఉపాధి పథకానికి రూ.65 కోట్లు, విద్యకు 2.6 శాతం మాత్రమే కేటాయించారు. వేతన జీవులకు ఆదాయ పన్ను మినహాయింపు పెంచినా బ్యాంకు వడ్డీల పేరుతో లాగే ప్రయత్నం జరిగింది.’’
పోటు ప్రసాద్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి


‘‘కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్‌ వర్గాలను సంతృప్తిపరిచేలా ఉంది. నిరుద్యోగులు, రైతులు, మధ్యతరగతి వర్గాలను నిరాశపరిచింది. కీలక వ్యవసాయ రంగానికి తగిన కేటాయింపులు లేవు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు. రాష్ట్రంలో బయ్యారం ఉక్కు కర్మాగారానికి, ఇతర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేవు. పొడిగింపు విషయంలోనూ అన్యాయం జరిగిది.’’
 పోటు రంగారావు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి


‘‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం దొరకని బడ్జెట్‌ ఇది. బడ్జెట్‌లో రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు కొత్త ప్రతిపాదనలేమీ లేవు. గతంలో హామీ ఇచ్చినా వాటి ఊసే లేదు. ఉపాధి హామీకి గతం కన్నా రూ.30 వేల కోట్లు తగ్గించారు. పరిశ్రమలకు 2 శాతం పన్ను మినహాయింపు కంటి తుడుపు చర్య’’.
- నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఖమ్మం
- ఖమ్మం బుర్హాన్‌పురం, ఖమ్మం కమాన్‌బజార్‌, ఖమ్మం నగరం,
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని