logo

అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం

పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్‌ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు.

Published : 29 Mar 2024 02:15 IST

మంత్రి శశికుమార్‌

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్‌ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంటల సాగుకు రూ.5లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇటీవల పంటల సీజన్‌ ముగిసింది. వరి, పత్తి దిగుబడులు చాలా తగ్గాయి. అప్పులు తీరే దారిలేకపోవడంతో మనస్తాపం చెందిన శశికుమార్‌ గురువారం పొలానికి వెళ్లి పురుగుమందు తాగాడు. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


రోటవేటర్‌లో చేయిపడి అన్నదాత దుర్మరణం

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో చేయి పడి రైతు దుర్మరణం పాలైన ఘటన మధిర మండలం నిధానపురంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఎస్సై లక్ష్మీభార్గవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అమరవాది నర్సిరెడ్డి(55) మిరప తోటను రోటవేటర్‌తో తొలగిస్తున్నారు. అందులో చెత్త ఇరుక్కుపోవటంతో తీసివేసేందుకు ప్రయత్నించగా అందులో చేయి పడింది. దీంతో యంత్రంలో చిక్కుకుని తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.


పరీక్ష కేంద్రాల విధుల్లోంచి ముగ్గురి తొలగింపు

కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిపై అధికారులు గురువారం వేటు వేశారు. గుండాల మండలం ఏజీహెచ్‌ఎస్‌ కాచనపల్లి పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌) శాంతారావు, డిపార్టుమెంటల్‌ అధికారి(డీఓ)నాగేశ్వరరావును డీఈఓ వెంకటేశ్వరాచారి విధుల్లోంచి తొలగించారు. పరీక్ష సమయంలో విద్యాలయానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కేంద్రం లోపలకు అనుమతి లేకుండా రావడాన్ని ఫ్లయింగ్‌స్క్వాడ్‌ గమనించింది. దీంతో ఆ కేంద్రం బాధ్యులైన శాంతారావు, నాగేశ్వరావుపై డీఈఓ చర్యలు తీసుకున్నారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓకు నివేదించారు. మణుగూరు పీవీకాలనీ సింగరేణి కాలరీఎస్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్థి చివరి నిమిషంలో అదనపు సమాధాన పత్రం అడుగగా ఇచ్చేందుకు నిరాకరించిన ఇన్విజిలేటర్‌ రాంబాబునూ విధుల నుంచి తప్పించారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించినట్లు డీఈఓ పేర్కొన్నారు. జిల్లాలో గురువారం జరిగిన జీవశాస్త్ర పరీక్షకు 12,619 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. డీఈఓ నాలుగు మండలాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు మరో 18 కేంద్రాలను తనిఖీ చేశారు.


ఎస్‌ఐ డ్రైవర్‌నంటూ రూ.15 వేలతో ఉడాయింపు

కూసుమంచి, న్యూస్‌టుడే: ఎస్‌ఐ వాహనడ్రైవర్‌నంటూ పెట్రోలు బంకు సిబ్బంది వద్ద డబ్బులు తీసుకొని ఉడాయించాడు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ కథనం మేరకు.. గుర్తుతెలియని యువకుడు గురువారం కూసుమంచిలోని పెట్రోలు బంకువద్దకు వెళ్లాడు. తాను ఎస్‌ఐ వాహన డ్రైవర్‌నని, ఆయన వద్ద రూ.15 వేల విలువైన రూ.100 నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు తీసుకొచ్చి వాటిని తీసుకెళ్లమని ఎస్సై తనకు చెప్పినట్టు నమ్మించాడు. దీంతో బంకు ఆపరేటర్‌ మహిపాల్‌ రూ.500 నోట్లు 30 ఇచ్చాడు. నోట్లు తీసుకొని వెళ్లిన యువకుడు ఎంతకూ రాకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు ఖమ్మంలో దొంగించిన ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని