logo

పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం డోకుపాడు గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివాసీలను దుమ్ముగూడెం పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. డోకుపాడుకు చెందిన దాదాపు 46 మంది ఆదివాసీలను దుమ్ముగూడెం స్టేషన్‌కు రావాలని ఈ నెల 12న పోలీసు అధికారులు సూచించారు.

Published : 17 Apr 2024 03:03 IST

డోకుపాడు గ్రామస్థులు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం డోకుపాడు గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివాసీలను దుమ్ముగూడెం పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. డోకుపాడుకు చెందిన దాదాపు 46 మంది ఆదివాసీలను దుమ్ముగూడెం స్టేషన్‌కు రావాలని ఈ నెల 12న పోలీసు అధికారులు సూచించారు. అక్కడ్నుంచి ఆదివాసీలు మంగళవారం స్టేషన్‌కు వచ్చారు. మావోయిస్టు కార్యకలాపాలపై విచారణ చేసిన అనంతరం తెల్లం జోగా, ముచికి సన్నా, కొవ్వాసి మంగ, రవ్వా సన్నా, రవ్వా లక్మా అనే అయిదుగురిని అదుపులోకి తీసుకొని మిగిలినవారిని విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులు వెంటనే తమవారిని విడిచిపెట్టాలని, మావోయిస్టులతో ఎలాంటి సంబంధంలేదని పోలీసులను అభ్యర్థించారు. అయినా విడిచిపెట్టకపోవడంతో విలేకరుల వద్ద తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. గతంలో ఉన్న కేసులను ఎత్తివేస్తామని నమ్మించి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీఐ అశోక్‌ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారన్నారు.

మావోయిస్టు ఆర్‌పీసీ సభ్యుల అరెస్టు

చర్ల, న్యూస్‌టుడే: చర్లలో ఇద్దరు మావోయిస్టు ఆర్‌పీసీ(రెవెల్యూయేషన్‌ పీపుల్స్‌ కమిటీ) మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సీఐ రాజవర్మ మంగళవారం రాత్రి వెల్లండించారు. తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం మధ్యాహ్నం చర్ల పోలీసులు, ప్రత్యేక పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకన్నారు. వారి నుంచి మావోయిస్టు పార్టీ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా జెట్టిపాడుకు చెందిన పొడియం చుక్కల్‌, పొడియం పాండుగా గుర్తించి అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని