logo
Published : 07 Dec 2021 02:25 IST

మళ్లీ ప్రజాభిప్రాయసేకరణ..!

పోర్టు నిర్మాణంపై గందరగోళం

గిలకలదిండి రేవు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : ఎన్నికల హామీగా మారిన బందరు పోర్టు నిర్మాణంలో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అసలు పనులు ప్రారంభిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఈనెల 15న పర్యావరణ సంబంధిత అంశాలపై బహిరంగ విచారణ నిర్వహించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

2006లో ఒకసారి..

బందరు పోర్టు నిర్మాణంపై 2006 సంవత్సరంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత ప్రణాళికలో వివిధ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 5వేల ఎకరాలకుపైగా భూమి అవసరం అవుతుందని, దానికి సంబంధించిన కసరత్తు చేశారు. ప్రస్తుతం అది 3,700 ఎకరాలకుపైగా మాత్రమే చాలని భావిస్తున్నారు. ఇలా విధానంలో మార్పులు చోటుచేసుకోవడంతోపాటు అప్పటి పరిస్థితులకు, ఇప్పటికి తేడా ఉంటుందని, అందుకే మళ్లీ పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ముడ అధికారులు దానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ నెల 15న మచిలీపట్నంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించి వివిధ సంస్థలు, ప్రతిపాదిత పోర్టు పరిసర గ్రామాలకు చెందిన ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. దీనివల్ల జన జీవనానికి ఇబ్బంది ఉంటుందా, పర్యావరణ కలుషితం, ధ్వని, వాయు కాలుష్యంలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు తదితర అంశాలపై అభిప్రాయాలు తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు.

ముడ కార్యాలయం

దశలవారీగా ..

మచిలీపట్నం పోర్టుకు 2008లోనే శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడంతోపాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా వివిధ కారణాలతో పనులు ఇంకా ప్రారంభం కాని దుస్థితి. దీంతో శంకుస్థాపనలతోనే సరిపెట్టినట్లయ్యింది. ప్రభుత్వం దాదాపు రూ.5,834 కోట్ల అంచనా వ్యయంతో తొలి దశలో 6 బెర్తులు నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడితోనే ఆగిపోయినట్లయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వం దశలవారీగా నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తోంది. మొదటి దశలతో 3 బెర్తులు, బ్రేక్‌వాటర్స్‌, నావిగేషనల్‌ ఛానల్స్‌, ఫ్లోటింగ్‌క్రాప్ట్‌లు తదితరాలతో దాదాపు రూ.1860 కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా వేశారు. పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పరిపాలనా భవనం, 3 విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణం, ఫెర్టిలైజర్స్‌, రసాయనాలు నిల్వచేసే గోదాములు, అగ్నిమాపకకేంద్రం తదితర పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇంకెంత అవసరం..?

ప్రస్తుతం పోర్టు నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి 3,762 ఎకరాల స్థలం అవసరం అవుతుందని నిర్ణయించారు. దీనిలో ఇప్పటికే ప్రభుత్వ భూమితోపాటు, కొనుగోలు చేసినది కలిపి 2,328 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఇంకా 1,434 ఎకరాలు అవసరం ఉండగా ల్యాండ్‌పూలింగ్‌లో 530 ఎకరాలకుపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు గత మూడేళ్లుగా కౌలు ఇవ్వడం లేదు. దీంతోపాటు వారికి అభివృద్ధి చేసిన స్థలం 1200 గజాలు ఇవ్వాల్సి ఉంది. రోడ్డు, రైలుమార్గాల అనుసంధానానికి కూడా కొంత భూమి కావాలి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థల సంబంధిత అంశాలపై కూడా మళ్లీ సమీక్షించనున్నారు.

కొంత భూమి సేకరించాల్సి ఉంది

పోర్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. రోడ్డు, రైలు మార్గాల అనుసంధానానికి కూడా కొంత భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి సర్వేచేయించి నివేదికను అందజేశాం. ప్రస్తుతం ఎంత భూమి ఉంది, ఇంకెంత అవసరం ఉంది, అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్‌భూమి ఉందా లాంటి అంశాలను కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నాం. - శివనారాయణరెడ్డి, ముడ వీసీ

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని