logo

ప్రచారం ఘనం.. సేవలు నిదానం

సాగులో రైతులను దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌ల పనితీరు క్షేత్రస్థాయిలో ఆశించినంతగా లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు వ్యవసాయ సబ్‌డివిజన్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో విత్తనాలు, ఎరువుల పరీక్షల

Updated : 28 Jun 2022 02:25 IST

అలంకారప్రాయంగా అగ్రిల్యాబ్‌లు

పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

ఆళ్లగడ్డ, మంత్రాలయం, న్యూస్‌టుడే: సాగులో రైతులను దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌ల పనితీరు క్షేత్రస్థాయిలో ఆశించినంతగా లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు వ్యవసాయ సబ్‌డివిజన్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో విత్తనాలు, ఎరువుల పరీక్షల సంఖ్య 50కి మించి లేదు. ప్రధానంగా సిబ్బంది కొరత వేధిస్తోంది.

భూసార పరీక్షల ఊసే లేదు

* ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ, నంద్యాల, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోనిలో వీటిని ఏర్పాటు చేశారు. ఏడాది కావొస్తున్నా సేవలు నత్తను తలపిస్తున్నాయి. ఒక్కో కేంద్రాన్ని రూ.55 లక్షలతో (నాబార్డు, ఆర్‌కేవీవై) నిర్మించారు. గతేడాది జులైలో వీటిని ప్రారంభించారు.

* కేంద్రంలో ఒక ఏవో స్థాయి అధికారి, ముగ్గురు సహాయకులు పనిచేస్తున్నారు. ఏటా ఒక్కో కేంద్రం నిర్వహణకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఆళ్లగడ్డలో గతేడాది జులై 8న ప్రారంభించినా ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలకు సంబంధించి కేవలం 16 పరీక్షలే చేపట్టారు.

* పెస్టిసైడ్‌ (పురుగు మందుల), భూసార పరీక్షల ఊసే లేదు. భూసార పరీక్షలు నిర్వహించకపోవడంతో రైతులు పెదవి విరిస్తున్నారు. ఆయా కేంద్రాలు అందించే సేవలపై అవగాహన కల్పించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు.

విద్యుత్తు బిల్లులకు డబ్బుల్లేవు

అగ్రి ల్యాబ్‌లో ఓ రిసెప్షనిస్టు, కేంద్ర శుభ్రతకు సిబ్బంది ఉండాలి. ప్రారంభించి ఏడాది అవుతున్నా వీరి నియామకం చేపట్టలేదు. కనీసం విద్యుత్తు బిల్లులూ చెల్లించడం లేదు. విద్యుత్తు సిబ్బంది కనెక్షన్‌ తొలగిస్తారోనన్న ఆందోళన అధికారుల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఎరువుల్ని పరీక్షించాల్సి వస్తే విద్యుత్తు బిల్లు భారీగా వస్తుంది.. అప్పుడేమవుతుందోనని సిబ్బంది భయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని