logo

గుప్పుమంటున్న గంజాయి వాసన

దేశంలోనే మాదకద్రవ్యాల వినియోగం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉందని ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’’ పేరుతో కేంద్రం నివేదికలు విడుదల చేసింది

Published : 06 Dec 2022 02:26 IST

ఈనాడు - కర్నూలు: దేశంలోనే మాదకద్రవ్యాల వినియోగం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉందని ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’’ పేరుతో కేంద్రం నివేదికలు విడుదల చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ వినియోగం ఎక్కువగా ఉంది. యువత గంజాయి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు జిల్లా మీదుగా రవాణా చేస్తున్నారు. ఇందులో యువకులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

భారీగా పట్టుబడుతోంది

సెబ్‌ ఏర్పాటయ్యాక కర్నూలు జిల్లా పరిధిలో గంజాయి భారీగా పట్టుబడుతోంది. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక, బెంగళూరు నుంచి హైదరాబాద్‌, విశాఖ నుంచి కర్నూలుకు తరలిస్తూ ముఠాలు పట్టుబడ్డాయి. 2020 నుంచి ఇప్పటి వరకు ఒక్క కర్నూలు జిల్లా పరిధిలోనే 43 మాదకద్రవ్యాల రవాణా కేసులు నమోదయ్యాయి. ఇందులో 99 మందిని అదుపులోకి తీసుకోగా, అక్షరాలా 3,760 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల పరిధిలోనూ వందల కిలోలు పట్టుబడింది. ఈ గణాంకాలు చూస్తే ఉమ్మడి జిల్లాలో గంజాయి వాసన ఎలా గుప్పుమంటుందో చెప్పొచ్చు.

ఎక్కడి నుంచో తెచ్చి

మూడు-నాలుగేళ్ల కిందట ఆదోని డివిజన్‌ పరిధిలో సాగు చేస్తుండేవారు. దాడులు పెరగడంతో సాగు మానేశారు. అప్పటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. రైళ్లు, బస్సుల్లో తెచ్చి అప్పగించి వెళ్తున్నారు. కర్నూలు పాతబస్తీ ప్రాంతంలో వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల పట్టణంలోనూ నూనెపల్లి, దేవనగర్‌ ప్రాంతాల్లో గంజాయిని సిగరెట్లలో పెట్టి విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని వక్కిలేరు వంతెన వద్ద గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఆత్మకూరు పట్టణంలోని పద్మావతి స్కూలు ప్రాంతంలో చిన్నచిన్న ప్యాకెట్లలో రూ.50, రూ.100కు అమ్ముతున్నారు.

పుణ్యక్షేత్రాల పరిధిలోనూ

పుణ్య క్షేత్రాల పరిధిలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఎగువ అహోబిలంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు ద్విచక్రవాహనాల్లో గంజాయి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శ్రీశైలంలోని సున్నిపెంటలోనూ అమ్మకాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని