logo

చెదిరిన ఒప్పందం

ఆదోని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారు(అనిశా)లు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. లంచం తీసుకుంటున్న ఒప్పంద ఉద్యోగి షఫీని అనిశా అధికారులు నేరుగా పట్టుకున్నారు.

Updated : 02 Feb 2023 05:14 IST

లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఒప్పంద ఉద్యోగి, చిన్నపెండేకల్లు కార్యదర్శిపై కేసు

ఒప్పంద ఉద్యోగి షఫీ, కార్యదర్శి మల్లయ్యను విచారిస్తున్న అనిశా అధికారులు, పట్టుబడిన నగదు

ఆదోని నేరవార్తలు, ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ అధికారు(అనిశా)లు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. లంచం తీసుకుంటున్న ఒప్పంద ఉద్యోగి షఫీని అనిశా అధికారులు నేరుగా పట్టుకున్నారు. లంచం తీసుకోవాలని సూచించిన చిన్నపెండేకల్లు పంచాయతీ కార్యదర్శి మల్లయ్యపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం చిన్నపెండేకల్లు గ్రామానికి చెందిన గురురాజారెడ్డికి గ్రామంలో వంశపారంపర్యంగా వచ్చిన మూడు సెంట్ల స్థలం ఉంది. దాన్ని విక్రయించాలనుకున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వెళ్లారు. స్థలం విక్రయించాలంటే పంచాయతీ కార్యదర్శి నుంచి నో-ఆబ్జెక్షన్‌ ధ్రువపత్రం తీసుకురావాలని అధికారులు పేర్కొన్నారు. దీంతో గురురాజారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లయ్యను గత నెల 28న సంప్రదించారు. ఇందుకు రూ.7 వేలు లంచం అడిగారన్నారు. అంతడబ్బు ఇచ్చుకోలేనని రూ.4 వేలుకు బేరం కుదుర్చుకున్నాడన్నారు. దీంతో గురురాజారారెడ్డి కర్నూలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో గురురాజారెడ్డి మండల పరిషత్‌ కార్యాలయంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి మల్లయ్య వద్దకు వెళ్లి రూ.4వేలు లంచం ఇవ్వబోగా.. ఆయన ఆ డబ్బు తీసుకోకుండా పెద్దతుంబళం పంచాయతీలో ఒప్పంద పద్ధతిన పనిచేస్తున్న బిల్‌ కలెక్టర్‌ షపీకి ఇవ్వమని చెప్పారన్నారు. అక్కడే ఉన్న షఫీ కార్యాలయం గేటు వద్దకు వచ్చారు. గురురాజారెడ్డి ఆయనకు రూ.4 వేలు లంచం ఇస్తుండగా.. కాపు కాసిన అనిశా అధికారులు పట్టుకున్నారన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. లంచం తీసుకున్న షఫీతో పాటు ఇవ్వమని చెప్పిన కార్యదర్శి మల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనాథ్‌రెడ్డి, ఇంతియాజ్‌బాషా, కృష్ణయ్య, వంశీనాథ్‌, కృష్ణారెడ్డి, తేజేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని