logo

భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం

కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు

Updated : 25 Apr 2024 05:40 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి కలెక్టరేట్‌ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానులు క్రేన్‌ సాయంతో భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ మౌర్యకు నామినేషన్‌ పత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. భూకబ్జాదారులు, అక్రమార్కులను ఇంటికి సాగనంపుతామని స్పష్టం చేశారు. ఆమెతోపాటు తెదేపా నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, జనసేన ఉమ్మడి జిల్లా సమన్వయకర్త చింతా సురేశ్‌బాబు, భాజపా నేత జీఎస్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పత్తికొండ: కేఈ శ్యాంబాబు (తెదేపా)

 పత్తికొండ గ్రామీణం, పత్తికొండ, న్యూస్‌టుడే: పత్తికొండ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు బుధవారం వేలాది మంది కార్యకర్తలతో వెళ్లి నామినేషన్‌ వేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, రాజశేఖర్‌, సుబ్బరాయుడు, మనోహర్‌చౌదరి, కేఈ హరిబాబు, కేఈ వేణు, ఆలంకొండ నబీ, కేఈ దివాకర్‌, శంకరయ్య, దండి మల్లికార్జున, తిమ్మయ్యచౌదరి, పూనామల్లికార్జున, బలరాంగౌడ్‌, శ్రీరాములు, చిట్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.

 అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన పేరుపై రూ.3.23 కోట్ల స్థిరాస్తులు, రూ.1.19 కోట్ల అప్పులున్నట్లు చూపారు. ఆయన సతీమణి సునీత పేరుపై రూ.5.54 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు పేర్కొన్నారు.

కోడుమూరు: బొగ్గుల దస్తగిరి (తెదేపా)

కర్నూలు నగరం, కర్నూలు గ్రామీణం, న్యూస్‌టుడే: కోడుమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి మరోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం ఆయన కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి శేషిరెడ్డికి రెండు సెట్ల నామపత్రాలు అందించారు. తెదేపా తరఫున ఎం.సుధారాణి ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. అభ్యర్థి వెంట తెదేపా సీనియర్‌ నేత విష్ణువర్దన్‌రెడ్డి, పార్టీ పరిశీలకులు రామిలింగారెడ్డ్డి ఉన్నారు. అంతకుముందు విష్ణువర్దన్‌రెడ్డి నివాసం నుంచి బొగ్గుల దస్తగిరి తెదేపా నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. బాణసంచా కాల్చుతూ ఊరేగింపుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి పరిగెల మురళీకృష్ణ మరోసారి రెండు సెట్లు, బీఎస్పీ అభ్యర్థి గిరిపోగు జయరాజ్‌ ఒక నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు