logo

గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

Updated : 27 Mar 2024 05:43 IST

కాంగ్రెస్‌లో పలువురి చేరికతో మారనున్న సమీకరణాలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చివరి ప్రయత్నంగా ఓటర్ల సమీకరణాలను సరి చూసుకుంటున్నారు. 2021లో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సమయంలో పూర్వ మహబూబ్‌నగర్‌లో పార్టీల గుర్తులపై గెలిచిన ప్రజాప్రతినిధులు భారాస నుంచి 1,039(71%),  కాంగ్రెస్‌-241(16.67%), భాజపా-119(8.23%), ఇతరులు-46(3.18 %) ఉన్నారు. 2021 నవంబరులో పాలమూరులోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పూర్తి మెజార్టీ భారాసకు ఉండటంతో ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారాస ప్రజాప్రతినిధులు కొందరు ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు కాంగ్రెస్‌లోకి రావడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి(భారాస) ఇప్పుడు తమకున్న ఓటర్ల బలాబలాలపై దృష్టి సారించారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.

ప్రభుత్వం మారడంతో..: భారాసకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తుతం గోవాలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా క్యాంపులో పార్టీ ముఖ్యుల సమక్షంలో ఉన్నారు.  పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇటీవల వీరితో సమావేశమై భారాసకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం క్యాంపులో భారాసకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు మొత్తం 526 మంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని కాపాడుకుని ఈ ఓట్లన్నీ తమకే పడేలా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మిగతా 913 మంది ఓటర్లపై ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కూడా నియోజకవర్గాల వారీగా క్యాంపులకు తరలించారు. గోవా, ఏపీలోని పలు ప్రాంతాలకు కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు వెళ్లారు. ఒక్కో శిబిరంలోని ఓటర్లు ఒక్కోచోట ఉండటంతో మొత్తం ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. సుమారు 700 మంది కాంగ్రెస్‌ శిబిరంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో 80 మంది భాజపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఊటీ, కేరళలో ఉన్నట్లు సమాచారం. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆ నేతల క్యాంపునకు ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భాజపా ఓట్లు ఎవరికి పడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. మిగిలిన ఓటర్లు స్థానికంగానే ఉంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలవాలంటే మొత్తం పోలైన ఓట్లలో సగానికి కంటే ఒకటి ఎక్కువ రావాలి. శిబిరాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు తమ పార్టీకే ఓటు వేస్తారా.. క్రాస్‌ ఓటింగ్‌ వేస్తారా అన్నది ప్రధాన అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 28న పోలింగ్‌ ఉండటంతో ఏ ఒక్క ఓటు చేజారకుండా ప్రధాన పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని