logo

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Published : 28 Mar 2024 04:39 IST

ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌

ఎన్నికల సామగ్రితో బయలుదేరిన సిబ్బంది

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ బూత్‌లకు ఎన్నికల సామగ్రిని అధికారులు పంపించారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొడంగల్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రిని తరలించే ముందు అధికారులు ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. మొత్తం 10 రూట్లలో ఎన్నికల సిబ్బంది, సాయుధ బలగాల బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో సామగ్రిని తరలించారు. ఈ ఎన్నికల్లో సెక్టార్‌, రూట్‌ అధికారులు, పీవో, ఏపీవోలు కలిపి మొత్తం 450 మంది విధులు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఓటింగ్‌ ఉండటంతో ఇప్పటికే ఏ విధంగా ఓటు వేయాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రంలోకి నలుగురు చొప్పున మాత్రమే ఓటర్లను అనుమతిస్తారు. ఎన్నికల సంఘం నిర్దేశంచిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకుని  వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకురాలిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతికశాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు. బుధవారం ఆమె కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ పెట్టెలను స్ట్రాంగ్‌ రూంకు తరలిస్తారు.  

బరిలో ముగ్గురు అభ్యర్థులు..

ఉప ఎన్నికల బరిలో 16 మంది నామినేషన్లు వేయగా ముగ్గురి నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 13 మంది బరిలో ఉండగా 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరికి బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, భారాస నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ పోటీలో ఉన్నారు. 15 రోజులుగా ప్రధాన పార్టీ అభ్యర్థులు అంతర్గత ప్రచారం నిర్వహించారు. ఓటర్లు చేజారిపోకుండా శిబిరాలకు తరలించారు. వీరంతా బుధవారం సాయంత్రానికే కర్ణాటకలోని రాయచూరుకు చేరుకున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా అందులో 644 మంది పురుషులు, 795 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓటర్లు మహబూబ్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో 245 మంది ఉండగా, తక్కువ ఓటర్లు కొడంగల్‌ పోలింగ్‌ కేంద్రంలో 56 మంది ఉన్నారు. మొదటి ప్రాధాన్యత, రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలనే దానిపై అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లుకు అవగాహన కల్పించారు.


పోలింగ్‌ సామగ్రి తరలింపు

పోలింగ్‌ సామగ్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి నాయక్‌, పరిశీలకురాలు వాణి ప్రసాద్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ జి.రవినాయక్‌, ఎన్నికల పరిశీలకురాలు వాణి ప్రసాద్‌ ఆధ్వర్యంలో బుధవారం పూర్వ జిల్లా పరిధిలోని 10 పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి, బ్యాలెట్‌ పెట్టెలు తదితరాలు అందజేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో తుది విడత శిక్షణ ఇచ్చి వారికి సామగ్రిని పంపిణీ చేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన సిబ్బందితోపాటు సాయుధ బలగాల సమక్షంలో ఒక్కో కేంద్రానికి సామగ్రిని తరలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, మోహన్‌రావు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని