logo

ధ్రువీకరణ పత్రానికి తప్పని ప్రదక్షిణ!

మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌కు చెందిన ఫయాజ్‌, ఫౌజ్య దంపతులకు 9, 7, 3 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా తూప్రాన్‌లోని ఆసుపత్రుల్లో జన్మించారు. గతేడాది నవంబరులో తండ్రి ఫయాజ్‌ మృతి చెందాడు. తల్లి ఫౌజ్య ఆరు నెలలుగా వీరి జనన ధ్రువీకరణ

Published : 25 Jun 2022 01:25 IST

తూప్రాన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో పరిస్థితి

ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు

న్యూస్‌టుడే, తూప్రాన్‌

తూప్రాన్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు

* మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌కు చెందిన ఫయాజ్‌, ఫౌజ్య దంపతులకు 9, 7, 3 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా తూప్రాన్‌లోని ఆసుపత్రుల్లో జన్మించారు. గతేడాది నవంబరులో తండ్రి ఫయాజ్‌ మృతి చెందాడు. తల్లి ఫౌజ్య ఆరు నెలలుగా వీరి జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆసుపత్రి వారు ఇచ్చిన పత్రాలతో మీసేవా కేంద్రాలకు వెళ్లగా దరఖాస్తు తీసుకోలేదు. మనోహరాబాద్‌లోనే తీసుకోవాలని వెనక్కి పంపించారు. అక్కడికెళ్తే తమకు సంబంధం లేదని, ఎక్కడ జన్మిస్తే అక్కడే తీసుకోవాలని సూచించారు. ఇలా ఆరు నెలలుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు.

* మేడ్చల్‌-మల్కాజిరిగి జిల్లాకు చెందిన పద్మ.. కుతూరు మానస తూప్రాన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించింది. ఆమె ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకోగా తూప్రాన్‌ మండలానికి చెందిన వారికి మాత్రమే ఇస్తామని, ఇతర మండలాల వారికి ఇచ్చేందుకు అవకాశం లేదని దాన్ని మీసేవ నిర్వాహకులు తిరస్కరించారు. కేవలం ఈ ఇద్దరి సమస్యే కాదు.. ఎంతోమందికి ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాధితులు నిత్యం తూప్రాన్‌ తహసీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు.

డివిజన్‌ కేంద్రం తూప్రాన్‌లోని తహసీల్దారు కార్యాలయ అధికారులు ధ్రువీకరణ పత్రాల జారీకి నానా కొర్రీలు పెడుతున్నారు. కనీసం విద్యార్థులు చదువునేందుకు అవసరమైన పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తూప్రాన్‌ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రాల కోసం స్థానికంగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన తహసీల్దారు పెట్టిన కొత్త నిబంధనలతో వాటిని తిరస్కరిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆదాయం, కుల, ఈడబ్ల్యూఎస్‌ పత్రాల జారీలో భూమి ఉంటే పట్టాపాసు పుస్తకాలు, బోనఫైడ్‌ ఒరిజినల్‌ సర్టిపికెట్లు సమర్పించాలన్న నిబంధన అమలు చేస్తున్నారు. ఎక్కడ పుడితే అక్కడి నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సొంత మండలంలోనే తీసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం.

పాఠశాలల్లో చేర్పించేందుకు..

నూతన విద్యాసంవత్సరం ఇటీవల ప్రారంభమైంది. చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేందుకు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తూప్రాన్‌లో జన్మించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు ఇచ్చిన పత్రం ఆధారంగా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దారు.. దాన్ని ఆమోదించి ఆర్డీవోకు పంపిస్తారు. అక్కడి నుంచి ప్రొసిడింగ్‌ పత్రాన్ని జారీ చేస్తారు. దీని ఆధారంగా మీసేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు వీలుంటుంది. తూప్రాన్‌లో మాత్రం ఆయా వాటికి వ్యతిరేకంగా నిబంధనలు పెడుతూ చిన్నారుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారులు స్పందించాలని వారు విన్నవిస్తున్నారు.


తగిన చర్యలు తీసుకుంటాం..

- రమేశ్‌, అదనపు పాలనాధికారి

తూప్రాన్‌ తహసీల్దారు కార్యాలయంలో జనన ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇతర ధ్రువీకరణ పత్రాల జారీలోనూ వేగాన్ని పెంచేలా చొరవ చూపుతాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం.


ఇతర పత్రాల జారీలోనూ..

విద్యార్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తూప్రాన్‌ అధికారులు మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహిస్తున్నారు. కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాల జారీలోనూ కొత్త నిబంధనలు పెట్టి ఇరుకున పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10, 15 రోజులు గడుస్తున్నా జారీ చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని