logo

జిల్లాలో జల సంరక్షణ భేష్‌

నీటి సంరక్షణకు జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్‌ అధికారి డోనర్‌ హవోకిప్‌ ప్రశంసించారు. జలశక్తి అభియాన్‌ ద్వారా నీటి సంరక్షణ, భూగర్భజలాల

Published : 30 Jun 2022 01:51 IST

కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్‌ అధికారి


మాట్లాడుతున్న నోడల్‌ అధికారి డోనర్‌ హవోకిప్‌, పాలనాధికారి హరీష్‌, డీపీవో తరుణ్‌కుమార్‌, డీఈవో రమేశ్‌కుమార్‌, తదితరులు

మెదక్‌, న్యూస్‌టుడే: నీటి సంరక్షణకు జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్‌ అధికారి డోనర్‌ హవోకిప్‌ ప్రశంసించారు. జలశక్తి అభియాన్‌ ద్వారా నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపునకు గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, ఇంజినీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మెదక్‌లోని కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ సమతౌల్యానికి చేపట్టిన అడవుల పెంపకం, పల్లెప్రకృతి వనాలు, బృహత్‌ పల్లెప్రకృతి వనాల పెంపు బాగున్నాయని కితాబునిచ్చారు. తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. పాలనాధికారి హరీష్‌ మాట్లాడుతూ.. ఆరేళ్లుగా నీటి వనరుల సంరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టామని, అవి సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వాన నీటిని, సంప్రదాయ నీటి వనరుల రక్షణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం, సోషల్‌ ఫారెస్ట్రీ, నీటి పారుదల, తదితర శాఖల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. చెక్‌డ్యాంలు, ఫీడర్‌ ఛానళ్లు, ఫాంపండ్‌, ఇంకుడుగుంతలు నిర్మాణం చేపట్టామని, తద్వారా జిల్లాలో 7 మీ. మేర భూగర్భజలాలు పెరిగాయన్నారు. జిల్లాలోని 2,389 చెరువులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నాయని తెలిపారు. జల వనరులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నామని వివరించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నీటి వనరుల సంరక్షణకు ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై తగు సూచనలు చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు. డీఆర్డీవో శ్రీనివాస్‌ జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్‌ కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. జడ్పీ సీఈవో శైలేష్‌, డీపీవో తరుణ్‌కుమార్‌, డీఈవో రమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని