logo

టెట్‌లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపం..

టెట్‌లో ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ఉప్పర్‌పల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఐ చైతన్యరెడ్డి తెలిపిన వివరాలు.. ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన

Published : 03 Jul 2022 01:37 IST

యువతి బలవన్మరణం

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: టెట్‌లో ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ఉప్పర్‌పల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఐ చైతన్యరెడ్డి తెలిపిన వివరాలు.. ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన కనకవ్వ, లచ్చయ్య దంపతులకు కుమారుడు శ్రావణ్‌కుమార్‌, కుమార్తె శిరీష (21) ఉన్నారు. లచ్చయ్య గొర్రెలు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శిరీష సిద్దిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ చివరి సంవత్సరం చదువుతోంది. గత నెల 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అర్హత మార్కులు సాధించలేకపోవడంతో మనస్తాపం చెందింది. అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి కనకవ్వ ఇంటికొచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించడంలో బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి సోదరుడు శ్రావణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


కుటుంబ కలహాలతో మరొకరు..


 

ములుగు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్కూక్‌ మండలం పాములపర్తి శివారులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాలు గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ గ్రామానికి చెందిన పూదరి నర్సింలు (35) మర్కూక్‌ మండలం పాములపర్తి విద్యుత్తు ఉప కేంద్రంలో కొన్నేళ్లుగా ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో గొడవ జరిగింది. అదే రోజు సాయంత్రం తిరిగి పాములపర్తికి వెళ్లాడు. ఇంట్లో అందరూ విధులకు వెళ్లి ఉంటాడని భావించారు. అయితే శనివారం ఉదయం పాములపర్తి శివారులోని కొండపోచమ్మ కాలువ పక్కన విగత జీవిగా పడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అక్కడే పురుగు మందు డబ్బా దొరికింది. దీంతో అది తాగి ఆత్మహత్య చేసుకుంటాడని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: రాత్రి వేళ విధులకు వెళుతున్న ఓ కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందిన సంఘటన సంగారెడ్డి గ్రామీణ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి గ్రామీణ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న గుర్రపు సంగమేశ్వర్‌( 55) రోజువారీగానే రాత్రి పూట విధులు నిర్వహించేందుకు గ్రామీణ ఠాణాకు వెళుతున్నారు. 65వ నంబరు జాతీయ రహదారిపై నడుస్తుండగా  జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీ కొట్టగానే అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. శనివారం శవపరీక్షలు చేసి కుటుంబీకులకు అప్పగించారు. ఆయన స్వగ్రామం సిర్గాపూర్‌ మండలం పోచాపూర్‌. ప్రస్తుతం సంగారెడ్డి పట్టణ శివారులోని గీతానగర్‌లో నివాసం ఉంటున్నారు.  జనవరిలో బదిలీపై వచ్చారు. భార్య మూడేళ్ల క్రితం మృతి చెందారు. కుమారుడు, కూతురు ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ వివరించారు. సంగమేశ్వర్‌ మృతికి ఎస్పీ రమణకుమార్‌ సంతాపం తెలిపారు. ఉన్నతాధికారులనుంచి ఎన్నో ప్రశంసలు పొందారని గుర్తు చేశారు.


రూ.25 లక్షల విలువైన అభరణాల చోరీ

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం డివిజన్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో దొంగతనం జరిగింది. నిందితులు 28 తులాల బంగారం, 4.5కిలోల వెండి సామగ్రిని ఎత్తుకెళ్లారు. మెయిన్‌డోర్‌ తలుపు తాళాలు పగలగొట్టి, కిటికీ ఊచలు విరిచి లోనికి వెళ్లి తమ పని కానిచ్చేశారు. ఈక్రమంలో ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. మల్లికార్జున నగర్‌ కాలనీలోని సాయి కుటీర్‌ బహుళ అంతస్తుల భవనంలో నాలుగో అంతస్తులో కార్తీక్‌ ఉంటున్నాడు. ఇతను ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి రెండో అంతస్తులో ఉన్న తమ్ముడు కౌశిక్‌ను ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం కార్తీక్‌ తన ఇంటికి వెళ్లి చూడగా ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉన్నాయి. 28 తులాల బంగారం, 4.5 కేజీల వెండి ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయని గుర్తించారు. క్లూస్‌ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. ఇద్దరు చేతులకు గౌస్‌లు, ముఖాలకు తొడుగులు ధరించి దొంగతనం చేసినట్టు అపార్టుమెంటులోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని