logo

8.73 మీ. @ భూగర్భజలాలు

వర్షాకాలంలో తొలినాళ్ల నుంచే వానలు కురవడం మెతుకుసీమకు కలిసొచ్చింది. భారీ వర్షాలు పడటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వనరులు పొంగిపొర్లగా, భూగర్భజల మట్టం పెరిగింది. ఈ ఏడాది జులైతో పోలిస్తే 2.49 మీ. మేర పెరిగింది.

Published : 02 Oct 2022 01:26 IST

న్యూస్‌టుడే, మెదక్‌

వర్షాకాలంలో తొలినాళ్ల నుంచే వానలు కురవడం మెతుకుసీమకు కలిసొచ్చింది. భారీ వర్షాలు పడటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వనరులు పొంగిపొర్లగా, భూగర్భజల మట్టం పెరిగింది. ఈ ఏడాది జులైతో పోలిస్తే 2.49 మీ. మేర పెరిగింది. గతేడాది సెప్టెంబరులో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 10.02 మీటర్లు ఉండగా, ఈ సారి 8.73 మీ.కు చేరింది.

39 శాతం అధికం..
జూన్‌ నుంచి గత నెల వరకు ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. సాధారణ వర్షపాతం 741.0 మి.మీ. కాగా, ఇప్పటి వరకు 1,030.3 మి.మీ. మేర నమోదైంది. 39 శాతం (289.3) అధికంగా కురిసింది. జిల్లాలో తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో 1.20, శివ్వంపేట మండలం సిక్లిందాపూర్‌లో 1.66, మెదక్‌ పట్టణ పరిధి పిల్లికొట్టాలలో 2.22 మీటర్లు, వెల్దుర్తి మండలం కుకునూర్‌లో 2.31, టేక్మాల్‌ మండలం ఎల్లుపేటలో 2.42, శివ్వంపేటలో 2.94, తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో 2.96 మీటర్ల అడుగులో నీళ్లు ఉన్నాయి.

6  మండలాల్లో..
గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ సారి ఆరు మండలాల్లో నీటి మట్టం పెరిగింది. నాలుగు ప్రాంతాల్లో 10 మీ.లోపు నీళ్లు ఉన్నాయి. ఈ సారి సింగూరు ప్రాజెక్టులోకి ఎగువన కురిసిన వానలకు భారీగా వరద వచ్చి చేరడంతో దిగువన ఉన్న ఘనపూర్‌ ఆనకట్టకు విడుదల చేశారు. ఇప్పటివరకు సుమారు 45 టీఎంసీల మేర వదిలారు. హల్దీ ప్రాజెక్టు, కాలువల్లోకి సైతం నీళ్లు చేరాయి. దీంతో మంజీరా, హల్దీపై నిర్మించిన చెక్‌డ్యాంల వద్ద జలమట్టం బాగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న నీళ్లు వచ్చే రబీలో పంటల సాగుకు ఉపయుక్తం కానుంది. జిల్లాలో మంజీరా నది పరివాహాక ప్రాంతంతో పాటు హల్దీ ప్రాజెక్టుపై నిర్మించిన చెక్‌డ్యాంల నుంచి ప్రవాహం కొనసాగడం రైతాంగానికి ఊరటనిచ్చేదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని