logo

హలధారికి దారేది?

సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి భరోసాగా మారాల్సిన 161వ నంబరు జాతీయ రహదారి సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రధాన చౌరస్తాల్లో అండర్‌పాస్‌లు లేకపోవడమే కారణం.

Updated : 06 Feb 2023 05:43 IST

వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
అండర్‌పాస్‌లు లేక.. జాతీయ రహదారిపై తీరిది
ఈనాడు, సంగారెడ్డి

సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి భరోసాగా మారాల్సిన 161వ నంబరు జాతీయ రహదారి సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రధాన చౌరస్తాల్లో అండర్‌పాస్‌లు లేకపోవడమే కారణం. కంది మండలం మామిడిపల్లి చౌరస్తా నుంచి నిజాంపేట వరకు 66 కిలోమీటర్లకు సంబంధించి ఇటీవల సింగూరు సమీపంలో టోల్‌ రుసుం వసూలు ఆరంభించారు. తమ బాధలను పట్టించుకోవడం లేదని స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లోకి వెళ్లకుండా కంచె వేస్తున్నారంటున్నారు. అండర్‌పాస్‌లు లేకపోవడంతో రోడ్డుకు అవతలి వైపున్న పొలానికి వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తోందంటున్నారు.


కంచె నుంచి దూరి వెళ్లాల్సిందే

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మద్దికుంట నర్సింహులు. చౌటకూరు మండలం చక్రియాల్‌లో రోడ్డు పక్కనే వీరికి సాగు భూమి ఉంది. నాట్లు వేసేందుకు నారు పోశారు. దూరంగా ఉన్న మరో పొలానికి నారు ఇలా తీసుకెళుతూ కనిపించారు. పొలంలోకి వెళ్లకుండా కంచె వేశారని, కొంత వరకయినా తొలగించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తొలగిస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టారన్నారు. అందుకే కష్టమయినా ఇలా వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


గ్రామానికి దూరంగా.. నిరుపయోగం

మంజీరా నది దాటిన తర్వాత శివ్వంపేట గ్రామం రావడానికి ముందు నిర్మించిన అండర్‌పాస్‌ వంతెన ఇది. గ్రామానికి సమీపంలో కడితే ఉపయోగంగా ఉండేదని రైతులు, స్థానికులు చెబుతున్నారు. చక్రియాల నుంచి వచ్చే రైతులు రోడ్డుకు అవతలి వైపున్న పొలానికి వెళ్లాలంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని సింగూరు చౌరస్తా వద్ద ఉన్న టోల్‌ప్లాజాకు వెళ్లి... తిరిగి అంతే దూరం వెనక్కి రావాల్సి వస్తోంది.


చేనుకు చేరాలంటే..

సింగూరు కూడలి ఇది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తాడ్‌దాన్‌పల్లి మీదుగా సింగూరు వైపు వెళుతుంటాయి. పుల్కల్‌ మండల కేంద్రంతో పాటు చాలా గ్రామాలు ఈ మార్గంలో వస్తాయి. తాడ్‌దాన్‌పల్లికి చెందిన రైతుల పొలాలు రోడ్డుకు అవతలివైపే ఎక్కువగా ఉంటాయి. అండర్‌పాస్‌ నిర్మించలేదని రైతులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగూరు రోడ్డు మీదుగా వచ్చేవారు సంగారెడ్డి వైపు వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని సరాఫ్‌వెళ్లి వరకు వెళ్లి.. తిరిగి రావాల్సిన పరిస్థితి.


మరికొన్ని చోట్ల ఇలా..

* టోల్‌ప్లాజా వద్ద టోల్‌ చెల్లించే వాహనాల కోసం రోడ్డు విశాలంగా ఉన్నా.. టోల్‌ చెల్లించని ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఇరుకు దారితో సరిపెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది తప్పదు.

* చౌటకూరు మండలం ఉమ్నాపూర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. అండర్‌పాస్‌ లేకపోవడంతో ఇటీవల ఇద్దరు విద్యార్థులు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురయ్యారు.

* జోగిపేట ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల(బాలికలు) సమీపంలోని చౌరస్తా వద్దా ఇదే పరిస్థితి నెలకొంది.


సుల్తాన్‌పూర్‌ వద్ద నిర్మిస్తాం..
హర్షవర్ధన్‌, సైట్‌ ఇంజినీర్‌, ఎన్‌హెచ్‌ఏఐ

సింగూరు చౌరస్తా సమీపంలో సుల్తాన్‌పూర్‌ వద్ద మరో అండర్‌పాస్‌ నిర్మించనున్నాం. భూ సమస్య వల్ల జాప్యమైంది. మేం సేకరించిన రోడ్డు ఆక్రమణ కావొద్దనే కంచెలు వేస్తున్నాం. అవసరమైన చోట నిబంధనల మేరకు ఖాళీలు వదులుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని