logo

ప్రతిపాదనలకే పరిమితం

చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తోంది. విద్యతోపాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు.

Published : 09 Feb 2023 01:59 IST

కార్యరూపం దాల్చని అంగన్‌వాడీ సొంత భవనాలు

మారేపల్లిలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న కేంద్రం

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తోంది. విద్యతోపాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చాలా చోట్ల అసౌకర్యాల మధ్య అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయి. అద్దె తక్కువగా ఉండటంతో అంతకంటే ఎక్కువ సదుపాయాలు కల్పించలేమని యజమానులు చెబుతున్నారు. చిన్నారుల ఇబ్బందులు తీర్చాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా సొంత భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించి.. ఏడాది అవుతున్నా కార్యరూపం దాల్చని తీరుపై కథనం.

సదుపాయాలు కరవు

జిల్లాలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అందులో 450 చోట్ల మాత్రమే సొంత భవనాలున్నాయి. గ్రామ పంచాయతీకి చెందిన భవనాలు, సామూహిక భవనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నవి 432 ఉన్నాయి. 622 కేంద్రాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. గతంలో నగర ప్రాంతాల్లో రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.3వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.750 చొప్పున అద్దెగా చెల్లిస్తుండగా రెండేళ్ల కిందట ఆ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రానికి ఇల్లు, భవనం అద్దెకు ఇచ్చిన వారికి రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత భవనాలు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి మరమ్మతులు, ఇతర నిర్వహణ నిధులు సైతం అందని పరిస్థితి.

ఏడాది దాటినా..: అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల కోసం ప్రతిపాదనలు పంపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నుంచి తొలి విడతగా 75 భవనాలకు ఏడాది కిందట ప్రతిపాదనలు పంపారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించనున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షల వరకు కేటాయించనున్నట్లు తెలిపినా ఇప్పటి వరకు నిధుల ఊసేలేదు. భవనాల నిర్మాణం పూర్తయితే ఇరుకు గదుల్లో చిన్నారులు ఎదుర్కొంటున్న అవస్థలు దూరమయ్య అవకాశం ఉంటుంది. తాగునీటి వసతి, శౌచాలయాలు, ఆట స్థలం తదితర సదుపాయాలు సమకూర్చేందుకు వీలుంటుంది.


నిధులు విడుదల కావాల్సి ఉంది 

-పద్మావతి, జిల్లా సంక్షేమాధికారిణి

అప్పటి పాలనాధికారి హనుమంతరావు ఆమోదంతో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల కోసం ఏడాది కిందట ప్రతిపాదనలు పంపాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. నిధులు రాగానే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకుంటాం. సొంత భవనాల్లో చిన్నారులకు అవసరమైన సదుపాయాలన్నీ ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని